
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TG RTC) ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఆర్టీసీ వేతన సవరణపై యాజమాన్యం కీలక ముందడుగు వేసింది. 2021 వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించేందుకు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఎండీ.. అధికారులతో కూడిన ప్రత్యేక పే కమిటీని నియమించారు. ఈ కమిటీలో కె.గీత, సమీరా అఫ్రీన్, వై.శిరీషలకు కీలక బాధ్యతలు అప్పగించారు. మే 10వ తేదీలోపు కొత్త పే స్కేల్స్ రూపకల్పన పూర్తి చేయాలని ఎండీ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి విధి విధానాలను వెంటనే రూపొందించాలని సూచించారు.ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆమోదంతో ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
వేతన సవరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించినందుకు జెఎసి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎండీకి కృతజ్ఞతలు తెలుపుతూనే.. ఉద్యోగులకు ఇచ్చిన మిగతా హామీలను కూడా ప్రభుత్వం మరియు ,యాజమాన్యం త్వరితగతిన అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయంతో వేలాది మంది ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెరగనున్నాయి.