
హైదరాబాద్: తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం (ఏప్రిల్ 28) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవి కాలం 2026, ఏప్రిల్ 30తో ముగియనుంది. ప్రస్తుతం హోం సెక్రటరీగా ఉన్న సీవీ ఆనంద్ 2026, మే మొదటి వారంలో శివధర్ రెడ్డి స్థానంలో తెలంగాణ పోలీస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
పూర్తిస్థాయి డీజీపీ నియామకానికి సంబంధించి ఇప్పటికే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనల్ లిస్ట్ చేరిన సంగతి తెలిసిందే. యూపీఎస్సీ ప్యానెల్ లిస్టులో1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్,1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లు ఉన్నాయి.
వీరిలో సీవీ ఆనంద్ సీనియర్ కావడంతో పాటు గతంలో ఆయన కీలకమైన హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్‌గా పని చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం సీవీ ఆనంద్‌ను డీజీపీగా నియమించింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవి విరమణ చేసిన తర్వాత మే మొదటి వారంలోనే సీవీ ఆనంద్ డీజీపీగా చార్జ్ తీసుకోనున్నట్లు సమాచారం.