
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్ట్ అని తాను అనలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. ప్రధాని తన మాటలతో ప్రజలను, రాజకీయ పార్టీలను భయపెడ్తున్నారనే అర్థంలో తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. ఖర్గే మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘నేను మోదీని టెర్రరిస్ట్ అని అనలేదు. ఆయన ఎప్పుడూ ప్రజలను, పొలిటికల్ పార్టీలను బెదిరిస్తుంటారు. ఈడీ, ఐటీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ప్రజలను, పార్టీలను టెర్రరైజ్ చేస్తూంటారని చెప్పిన” అని ఖర్గే క్లారిటీ ఇచ్చారు.
అంతకుముందురోజు.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అన్నా డీఎంకే పార్టీ బీజేపీతో కూటమిగా ఏర్పడటాన్ని ఖర్గే విమర్శించారు. “అన్నాదురై వంటి నేతల ఆలోచనలను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పుకునే ఆ పార్టీ, మోదీతో ఎలా చేతులు కలుపుతుంది..? ఆయన టెర్రరిస్ట్‌లాంటోడు. వాళ్ల పార్టీ న్యాయం, సమానత్వాన్ని నమ్మదు. అన్నా డీఎంకే నేతలు వారితో కలుస్తున్నారు అంటే.. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నట్లే” అని ఖర్గే విమర్శించారు.
ఈ కామెంట్లను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ ఒక అర్బన్ నక్సల్ పార్టీ అని, అందుకే ఖర్గే ఇలాంటి భాషను వాడుతారని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి మండిపడ్డారు. ఈ కామెంట్లకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు.