
- బీజేపీలో చేరేందుకే హరీశ్ రావు ఢిల్లీ టూర్: విప్ అద్దంకి దయాకర్
- విషం చిమ్మడమే తప్ప కేసీఆర్ స్పీచ్ లో విషయం లేదు: విప్ వేముల వీరేశం
- కేసీఆర్, జీవన్‌రెడ్డిపై మండిపడిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ గా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరితే.. ఇప్పుడు ఆయనను పట్టించుకునే పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలు లేరని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీంతో చేసేది లేక పొన్నాల వీడియోలు చేసుకుంటూ సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారని అన్నారు. మంగళవారం చామల హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ లో చేరిన రోజుతోనే జీవన్ రెడ్డి పండుగ అయిపోయిందన్నారు. బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరడం అనేది ఆలోచన లేని పనిగా ఎంపీ చామల అభివర్ణించారు.
సభ పేరిట డైవర్షన్ప్లాన్: అద్దంకి దయాకర్
కాళేశ్వరానికి నిపుణుల కమిటీ వచ్చిన రోజే జీవన్ రెడ్డి జాయినింగ్ సభ పెట్టడం ఏంటని ఎమ్మెల్సీ, విప్ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ బహిరంగ సభ పేరుతో రాష్ట్ర రాజకీయాలను డైవర్ట్ చేసే ప్లాన్ చేసిండని మండిపడ్డారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. హరీశ్ రావు ఢిల్లీ టూర్ బండారం బయటపడే సరికి కేసీఆర్ ను పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారని విమర్శించారు. హరీశ్ రావు బీజేపీలో చేరడం ఖాయమని, అందులో భాగంగానే ఆయన ఢిల్లీ టూర్ అని, అయితే వీటిని కప్పిపుచ్చుకునేందుకు ఆయన కాళేశ్వరం కథ అల్లుతుండని ధ్వజమెత్తారు.
విషం చిమ్మడం తప్ప కేసీఆర్ స్పీచ్ లో విషయం లేదు: విప్ వేముల వీరేశం
జగిత్యాల సభలో కేసీఆర్.. ప్రజా ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌పై విషం చిమ్మడం తప్ప, విషయం లేదని విప్ వేముల వీరేశం విమర్శించారు. మంగళవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ లో జీవన్ రెడ్డి ఉనికే ఉండదన్నారు. పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి, నాయిని నర్సింహా రెడ్డి, విజయశాంతి, ఈటల, రవీంద్ర నాయక్ లాంటి వాళ్లను కేసీఆర్ ఎలా అవమానించాడో జీవన్ రెడ్డి గుర్తు చేసుకోవాలని అన్నారు.
జీవన్ రెడ్డి పెద్ద ఫ్యూడల్: కవ్వంపల్లి సత్యనారాయణ
జీవన్ రెడ్డి పెద్ద ఫ్యూడల్ అని, అక్కడ దళితుడైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి అయితే జీర్ణించుకోలేకపోయిండని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. లక్ష్మణ్ కుమార్ డీసీసీ చీఫ్ అయితే ఆయనకు కనీసం సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించకుండా అడ్డుకున్నాడని, ఆయనను ప్రెస్ మీట్లు కూడా పెట్టనివ్వలేదని జీవన్ రెడ్డి తీరుపై మండిపడ్డారు.
బీఆర్ఎస్ ది ముగిసిన అధ్యాయం: విప్ బల్మూరి వెంకట్
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ది ముగిసిన అధ్యాయం అని, ఇక ఆ తర్వాత కేసీఆర్, జీవన్ రెడ్డి ఇద్దరూ.. రామా, కృష్ణా అంటూ బతకాల్సిందేనని విప్ బల్మూరి వెంకట్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అనే నోటు చెల్లదని తెలంగాణ ప్రజలు ఎప్పుడో తేల్చేశారని, ఈ ఇద్దరు నేతలతో తెలంగాణకు ఒరిగేది ఏమీ ఉండదన్నారు. పదవుల కోసం జీవన్ రెడ్డి నీచ రాజకీయాలు చేయడం తగదన్నారు.