Reading Time: 2 minutes

సీజ్ ఫైర్ పొడిగిస్తున్నా: ట్రంప్ సంచలన ప్రకటన

Caption of Image.

వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య రెండో దశ చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ కాల్పుల విరమణ అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరుదేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. మధ్యవర్తి పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు పూర్తి అయ్యే వరకు సీజ్ ఫైర్ కొనసాగుతుందని తెలిపారు. అయితే, హార్మూజ్ జలసంధిలో అమెరికా నావల్ బ్లాకేడ్ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమెరికా సైన్యం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

‘‘ఇరాన్ ప్రభుత్వం ఊహించిన విధంగానే చీలిపోయింది. ఇరాన్ ప్రతినిధులు ఒక ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు వచ్చేంత వరకు ఆ దేశంపై దాడిని నిలిపివేయమని పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌లు కోరారు. ఇరాన్ ప్రతిపాదనలతో ముందుకు వచ్చి చర్చలు కొలిక్కి వచ్చేంత వరకు కాల్పుల విరమణను పొడిగిస్తాను. అప్పటి వరకు ఇరాన్‎పై దాడిని నిలిపివేయాలని అమెరికా సైన్యాన్ని ఆదేశించాను. హార్మూజ్‎లో ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం మాత్రం కొనసాగుతుంది. అమెరికా సైన్యాన్ని అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాను’’ అని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ట్రూత్‎లో పోస్ట్ చేశారు.

పశ్చిమాసియాలో దాదాపు నెల రోజులుగా సాగుతోన్న యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో అమెరికా-ఇరాన్ మధ్య ఏప్రిల్ 8న రెండు వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యుద్ధాన్ని పూర్తిగా ముగించేందుకు పాకిస్తాన్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు జరిపాయి. కానీ ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు విఫలం అయ్యాయి. ఏప్రిల్ 22తో సీజ్ ఫైర్ గడువు ముగియనున్న నేపథ్యంలో రెండో దఫా చర్చలు జరపాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. అయితే, హార్మూజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడంతో రెండో దశ చర్చలకు బ్రేక్ పడింది. 

అమెరికా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ రెండో దశకు చర్చలు రాలేమని తేల్చిచెప్పింది. ఒకవైపు సీజ్ ఫైర్ గడువు ముగియడం.. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో యుద్ధం మళ్లీ మొదలవుతుందని ప్రపంచదేశాల్లో ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో సీజ్ ఫైర్ ఒప్పందాన్ని పొడిగించడంతో పాటు చర్చలు కొలిక్కి వచ్చే వరకు ఇరాన్‎పై దాడులు  నిలిపి వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు బ్రేక్ పడింది. 

©️ VIL Media Pvt Ltd.