
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన అల్టిమేటమ్ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని రక్షించుకోవడానికి 14 మిలియన్లకు పైగా ఇరానీయులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. తాను కూడా దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
అంతకుముందు, ఇరాన్ క్రీడల ఉప మంత్రి అలీరెజా రహీమీ మాట్లాడుతూ.. అమెరికా జరపబోయే వైమానిక దాడులను అడ్డుకునేందుకు, విద్యుత్ ప్లాంట్ల చుట్టూ మానవ గొలుసులు ఏర్పాటు చేయాలని దేశ క్రీడాకారులకు, కళాకారులకు పిలుపునిచ్చారు.
హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటమ్ విధించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి 8 గంటల వరకు ట్రంప్, ఇరాన్ కు గడువు విధించారు. ఈ లోపు, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించకపోతే.. ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, వంతెనను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున, ఏకకాలంలో బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ హెచ్చరించారు. కేవంల 4 గంటల సమయంలోనే వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.