Reading Time: < 1 minute
Telangana Cm Revanth Reddy Arvind Subramanian Gst Ai Reforms

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబడి పెంపు, ప్రభుత్వ శాఖల్లో సంస్కరణలపై హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల్లో తేవాల్సిన మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు.

రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆధారమైన జీఎస్టీ రాబడులను పెంచుకోవడంతో పాటు పన్నుల ఎగవేతకు అడ్డుకట్ట వేసేందుకు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) సాంకేతికతను రంగంలోకి దించాలని నిర్ణయించారు. వ్యాపారాలు చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సులభతర వాణిజ్యానికి ప్రాధాన్యం ఇస్తూనే ఈ నూతన సాంకేతికతను వినియోగిస్తామని సీఎం స్పష్టం చేశారు. పన్నుల విధానాన్ని మరింత సులభతరం చేసేలా ఏఐ ఆధారిత సమాచార వ్యవస్థను వాణిజ్య పన్నుల అధికారులకు అందుబాటులోకి తేనున్నారు.

ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో జరిగే పన్నుల లీకేజీలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. అందుకోసం మున్సిపల్, రేరా, పంచాయతీ రాజ్, విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖలను ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు అనుమతులు ఇచ్చే ప్రాథమిక దశలోనే నిర్మాణ సామాగ్రి అవసరాలను, దానికి అయ్యే పన్నుల అంచనాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోనున్నారు.

ఈ పన్నుల సమాచారంతో పాటు మీసేవా, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) వంటి కీలక పథకాల వివరాలను కూడా ఒకే చోటకు చేరిస్తే పరిపాలన మరింత పారదర్శకంగా, సులభంగా మారుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యాపారులను ఇబ్బంది పెట్టకుండానే పన్నుల వసూళ్లను పెంచడానికి సాంకేతికత ఎంతగానో తోడ్పడుతుందని అరవింద్ సుబ్రమణియన్ వివరించారు. ఈ కీలక సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, ఎక్సైజ్ కార్యదర్శి రఘునందన్ రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.