Reading Time: < 1 minute

ఉద్రిక్తతల నెలవైన హర్మూజ్ జలసంధి నుంచి సోమవారం రెండు భారతీయ పతాక ఎల్‌పిజి ట్యాంకరు నౌకలు సురక్షితంగా ఈ కీలక మార్గాన్ని దాటాయి. భారత్ మరికొన్ని మిత్రదేశాలకు హర్మూజ్ ప్రవేశానికి ఇరాన్ సమ్మతించిన దశలో ఈ పరిణామం చోటుచేసుకుంది. వంటగ్యాసుతో బయలుదేరిన గ్రీన్ సాన్వి నౌక 46650 టన్నుల ఎల్‌పిజితో ఈ నెల 7వ తేదీన భారతీయ రేవుకు చేరుకుంటుంది. ఇక 15500 టన్నుల వంటగ్యాసు సరుకుతో ఉన్న గ్రీన్ ఆశా ట్యాంకర్ నౌక ఈ నెల 9న ఇక్కడి పోర్టుకు వస్తుంది. ఈ విషయాలను కేంద్ర రేవులు,

నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగల్ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ నౌకల రాకతో దేశంలో వంటగ్యాసు కొరత కొంత మేర తీరే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈ జలసంధి మీదుగా భారతీయ పతాకలతో మరో 16 నౌకలతో పాటు మొత్తం 433 మంది నావికులు ఈ ప్రాంతంలో ప్రయాణం కోసం సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత గల్ఫ్ యుద్ధ భయాల దశలో భారతీయ సముద్ర మార్గ కార్యకలాపాలు సురక్షితంగా, అవిచ్ఛిన్నంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు.