
మధ్యప్రాచ్య యుద్ధ విరమణ దిశలో సోమవారం అత్యంత కీలకమైన ముసాయిదా శాంతిప్రతిపాదన వెలువడింది. మధ్యవర్తిత్వ దేశాలు ఈజిప్టు, పాకిస్థాన్, టర్కీలు రూపొందించి ఈ ప్రతిపాదనలు అమెరికా, ఇరాన్‌లకు పంపించాయి. 45 రోజుల పాటు యుద్ధ విరమణ, వెంటనే హర్మూజ్ జలసంధి తిరిగి తెరవడం వంటి కీలక అంశాలు ఈ ప్రతిపాదనలో ఉన్నాయి. మధ్యప్రాచ్య దేశాల అధికారి ఒకరు ఈ విషయాన్ని మీడియా సంస్థలకు వెల్లడించారు. తాత్కాలిక కాల్పుల విరమణతో ఇకపై శాశ్వత శాంతికి మార్గం ఏర్పుతుందని, ఈ 45 రోజుల సామరస్య ద్వారం మున్ముందు మంచి పరిణామాలకు దారితీస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనలను అమెరికా, ఇరాన్‌లకు పంపించామని నిర్థారించారు. అయితే తాత్కాలిక యుద్ధ విరమణకు తాము అంగీకరించేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యవర్తిత దేశం పాకిస్థాన్ ద్వారా అమెరికాకు తమ వైఖరిని తెలియజేసినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ సోమవారంనాడు రాత్రి ప్రకటించింది.
తాత్కాలిక యుద్ధ విరమణకు సిద్ధంగా లేమని, శాశ్వత యుద్ధ విరమణకే మొగ్గు చూపుతున్నట్లు ఇరాన్ కుండబద్ధలు కొట్టింది. ‘తాత్కాలిక కాల్పుల విరమణకు మేం సిద్ధంగా లేము. అందుకు ఒప్పుకోం’ అని కైరోలోని ఇరాన్ దౌత్యవేత్త మొజ్తాబా ఫిరదౌసి పౌర్ ‘అసోసియేటెడ్ ప్రెస్’తో వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో తమపై ఎలాంటి దాడులు జరగబోవు సహా తదితర పటిష్టమైన హామీలతోనే తాము శాశ్వతంగా యుద్ధానికి ముగింపు పలకాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు యుద్ధ విరమణ ప్రతిపాదనలపై వైట్‌హౌస్ కూడా స్పందించింది. ఎన్నో రకాల ఆచోచనల్లో అది ఒకటి అని పేర్కొంది. అధ్యక్షుడు ట్రంప్ మాత్రం యుద్ధం కొనసాగుతుందని చెప్పినట్లు శ్వేతసౌధం ప్రకటనలో వెల్లడించింది. అంతకుముందు హర్మూజ్‌పై డెడ్‌లైన్‌ను బుధవారంనాటి వరకు పెంచుతూ ట్రంప్ ప్రకటించారు. అప్పటి వరకు ఇరాన్ వంతెనలు, విద్యుత్ ప్లాంట్లపై దాడులు నిలిపివేస్తామని తెలిపారు. తాజాగా ఇరాన్ తాత్కాలిక కాల్పుల విరమణ, హర్మూజ్‌ను తెరిచేందుకు ఒప్పుకోకపోవడంతో అమెరికా వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఉత్కంఠగా మారింది.