
ఆదిలాబాద్ జిల్లా మీద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అమాయకులే కాదు.. నిరంకుశత్వం మీద పోరాడిన వీరులు అంటూ సిఎం రేవంత్ పొగిడారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” భహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ.. జల్ జంగల్ నినాదంతో పోరాట స్ఫూర్తిని చాటిన కొమురం భీమ్ గడ్డ ఇది అని, అలాంటి ఆదివాసీ వీరులు.. నిజాం నిరంకుశత్వంపై పోరాడారని అన్నారు. అభివృద్ధికి నోచుకోని ఆదిలాబాద్ ను పాలమూరు జిల్లాతో సమానంగా అభివృద్ధి చేయాలని ప్రేం సాగర్ రావు అనేవారని చెప్పారు.
“ఆదిలాబాద్ కు సాగునీరు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఈ వేదికగా మాట ఇస్తున్నా.. పెండింగ్ లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాదు.. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఎర్రబస్సు తిరగడమే కష్టమైన ఈ ప్రాంతంలో కేంద్రంతో మాట్లాడి ఎయిర్ పోర్ట్ మంజూరు చేయించాం. త్వరలోనే.. వీలైతే జూన్ 2 నాటికి ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శిలాఫలకం వేసే బాధ్యత తీసుకుంటాం. ఆదిలాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఇందుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఆదిలాబాద్ లో యూనివర్సిటీకి సంబంధించి భూసేకరణ చేపట్టాం. త్వరలోనే ఆదిలాబాద్ లో యూనివర్సిటీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తాం. బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరు చేశాం. ఆలయ అభివృద్ధికి అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తాం. ప్రేం సాగర్ రావు గారి అభ్యర్థన మేరకు గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. ఆదిలాబాద్ జిల్లాకు ఏమేం కావాలో అంచనాలు సిద్ధం చేస్తున్నాం. ప్రతీ రెండు నెలలకోసారి ఈ జిల్లాకు వస్తూనే ఉంటా.. నిధులు తెస్తూనే ఉంటాం.పేదల కళ్ళల్లో ఆనందం చూడాలనేది మా ప్రయత్నం. మేం పాలకులం కాదు… ప్రజల సేవకులం” అని సిఎం రేవంత్ అన్నారు.