Reading Time: < 1 minute

 ఇంటి కొనుగోలు విషయంలో మోసపోయానని మనస్థాపం చెందిన స్క్రాప్ వ్యాపారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అమీర్‌పేట్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సారపాకకు చెందిన ప్రవీణ్‌కుమార్ రెడ్డి(42) నగరంలోని అమీర్‌పేట్‌లో భార్య, పిల్లలతో కలిసి ఉంటూ స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు. బాధితుడు ఇటీవల వనస్థలిపురంలో రూ.3.5కోట్లకు ఇంటిని కొనుగోలు చేశాడు. డబ్బులు చెల్లించి, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత నకిలీ పత్రాలతో ఇంటిని విక్రయించినట్లు బాధితుడికి తెలిసింది. దీంతో మనస్థాపం చెందిన ప్రవీణ్‌కుమార్ రెడ్డి భార్యకు సూసైడ్ నోట్ రాశాడు,

తనకు వ్యాపారంలో రూ.6.8కోట్లు రావాల్సి ఉందని అందులో పేర్కొన్నాడు. బేగంపేటలోని రెనెక్సా టవర్స్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఉన్న చెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరివేసుకునే కంటే ముందే భార్యకు లొకేషన్ పంపించాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు తెలిపారు.