
మన తెలంగాణ/హైదరాబాద్: మంచు విష్ణుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ కేసులో పోలీసులు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ కారణంగా ఈ నెల 15 తర్వాత విచారణకు వస్తానని మంచు విష్ణు లిఖిత పూర్వకంగా పోలీసులకు తెలిపారు. అయితే ఈ కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు మాత్రం నోటీసులు ఇంకా అందలేదు. తిరుపతి జిల్లా తిరుచానూరులో జరిగిన కిడ్నాప్ ఘటనలో మోహన్‌బాబు, విష్ణు, పీఆర్వో సతీష్‌పై సహా 13మందిపై ఈ నెల 3న కిడ్నాప్ కేసు నమోదైంది. విద్యార్థులు అక్బర్, వినోద్‌ను కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మంచువిష్ణుకు మొత్తంగా పోలీసులు రెండు నోటీసులు ఇచ్చారు.
విద్యార్థి సంఘాల్ నేతలపై ఇచ్చిన ఫిర్యాదులో ఆధారాలు సమర్పించాలని చంద్రగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలాగే మరోవైపు విద్యార్థి సంఘాల నేతల కిడ్నాప్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ తిరుచానూరు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు, ఈ కేసును కొట్టి వేయాలని కోరుతూ మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన విద్యార్థి సంఘాలు, వామపక్షాలు విష్ణు, మోహన్ బాబులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. యూని వర్సిటీ గుర్తింపు రద్దు చేసి, అక్రమంగా వసూలు చేసిన రూ.26 కోట్ల ఫీజులను తిరిగి చెల్లించాలని కోరుతున్నాయి. ఈ కేసులో పోలీసులు విచా రణ కొనసాగిస్తున్నారు.
నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం సూచించిన ఫీజులనే అమలు చేయా లంటే గత కొన్నేళ్లుగా విద్యార్థి సంఘాల నేతలు పోరాటం చేస్తున్నారు. ఉన్నత విద్యా మండలి ఆదేశాలను ధిక్కరిస్తూ విద్యార్థులను వేధిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కలెక్టరేట్ వద్ద ధర్నాకు బయలుదేరిన ఎస్‌ఎఫ్‌ఐ నేతలను సుమారు 30 మంది బౌన్సర్లు వచ్చి అడ్డగించారని వారిపై దాడి చేశారంటూ సీపీఎం నేతలు ఎస్‌పి దృష్టికి తీసుకెళ్లారు.
ఎస్‌పి ఆదేశాల మేరకు ఎఎస్‌పి నేతృత్వంలోని ప్రత్యేక పోలీస్ బృందాలు వారి వాహనాలు వెంటాడి విద్యార్థి నాయకులను విడిపించినట్లు సిపిఎం నేతలు వెల్ల డించారు. ఆ తర్వాత ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, విద్యార్థి సంఘ నాయకుడు వినోద్‌లను మోహన్ బాబు బౌన్సర్లు కిడ్నాప్ చేశారం టూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మోహన్ బాబు, విష్ణు, వారి పీఆర్వో సతీష్‌లపై కేసు నమోదైంది. ఘటనకు కారణమైన ఐదుగురు బౌన్సర్లను పోలీసులు అరెస్ట్ చేసి వాహనాలు సీజ్ చేశారు. విచారణలో భాగంగా విష్ణుకు నోటీసులు జారీ చేయగా మోహన్ బాబుకు కూడా నోటీ సులు ఇచ్చేందుకు పోలీసులు చూస్తున్నట్లు తెలుస్తోంది.