Reading Time: < 1 minute

హైదరాబాద్: అన్నం పెట్టిన మాజీ సిఎం కెసిఆర్ కావాలా..నామం పెట్టి సున్నం పూసిన కాంగ్రెస్ కావాలా? అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో సదాశివ పేట ఎక్స్ రోడ్ నుంచి ప్రచార ర్యాలీ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు మాట్లాడుతూ.. బస్సు తప్ప కాంగ్రెస్ పాలన అంతా తుస్సు అని విమర్శించారు. భర్తలకు డబుల్ టికెట్ ఇచ్చి, భార్యలకు ఉచితంగా బస్సు టికెట్ పథకం అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.  బచ్చుగూడెంలో రూ.7.50 కోట్లతో రోడ్డు వేసి..భూములు విలువ పెంచింది కెసిఆర్ కాదా? అని ప్రశ్నించారు. తల్లి చేతిలో బిడ్డ ఎంత పదిలంగా ఉంటుందో.. కెసిఆర్ చేతిలో తెలంగాణ అంత పదిలంగా ఉంటుందని తెలియజేశారు. విషయం లేకనే రేవంత్ రెడ్డి విషం విషం చిమ్ముతున్నారని, గొర్రెలు, చేపపిల్లల పంపిణీ.. అన్నీ బంద్ పెట్టి పాలనను గాలికి వదిలేశారని.. బూతుల సిఎంగా చరిత్రలో మిగిలిపోతారని  దుయ్యబట్టారు. మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ప్రతి మహిళకు ఈ ప్రభుత్వం రూ.55 వేలు బాకీ ఉందని, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని మాయమాటలు చెప్పారని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేస్తేనే.. పని చేస్తామని కాంగ్రెస్ బెదిరిస్తోందని, మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.