
2011 కంటే ముందు ఉపాధ్యాయులుగా చేరిన వారికి రెండు సంవత్సరాల లోపు టెట్ పరీక్షను ఉత్తీర్ణత సాధించాలని లేకుంటే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తుందని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి, మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. తెలంగాణ లోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్, ఎయిడెడ్, ఇతర పాఠశాలలలో పనిచేసే టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్ (టెట్)తో భయాందోళనకు గురవుతున్నారు. సుప్రీంకోర్టు 31 ఆగస్టు, 2025 న ప్రతి ఒక్క టీచర్ టెట్ ఉత్తీర్ణత సాధించాలని లేదా ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందని ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన విధానం అనుసరిస్తుందో అని టీచర్స్ ఎదురుచూస్తున్నారు. 2009లో విద్యా కమిషన్ వచ్చిన తర్వాత 2010 నుండి టెట్ అమలులోకి వచ్చింది. టెట్ అమలులోకి వచ్చిన తరువాత 2012, 2017, 2024 మూడుసార్లు టీచర్స్ రిక్రూట్‌మెంట్ జరిగింది. టెట్ వారికి అమలులోకి వచ్చింది. అంతకు ముందు జరిగిన టీచర్స్ రిక్రూట్‌మెంట్‌లో టెట్ అమలులో లేదు. సుప్రీంకోర్ట్టు తీర్పులో ఐదు సంవత్సరాల లోపు పదవీ విరమణకు దగ్గర ఉన్న వాళ్ళకు మినహాయింపు ఇచ్చారు. 1996 నుండి టీచర్స్‌గా ఉన్న వాళ్ళకు, 30 సంవత్సరాలు కావస్తున్న 50 సంవత్సరాలు
దాటిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళలో కంటి చూపు, మోకాళ్ళనొప్పులు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. 50 సంవత్సరాలు దాటిన వారికి మినహాయింపు ఇవ్వడం కనీస న్యాయం. ప్రధానోపాధ్యాయ పదోన్నతిలో 50 సంవత్సరాలు దాటిన వారికి డిపార్ట్‌మెంట్ పరీక్ష నుండి మినహాయింపు ఉంది. 2024 సంవత్సరంలో ఎన్‌సిటిఇ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరితే 2010 కంటే ముందు టీచర్స్‌కు టెట్ అవసరం లేదని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు 30 నుండి 40 వేల మంది టీచర్స్‌పై ప్రభావం పడుతుంది. భాషోపాధ్యాయులు ఉర్దూ, కన్నడ ఇతర దేశ భాషలలో బోధించే ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్‌లో పేపర్ 3 నిర్వహిస్తున్నారు. తెలంగాణలో భాషోపాధ్యాయులకు సాంఘిక శాస్త్రం 60 మార్కులకు కేటాయించడం వలన అనేక మంది తెలుగులో ఉత్తీర్ణత సాధించడం లేదు. ముఖ్యంగా తెలుగు భాషలో నిర్వహించాలని అన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరుకుంటున్నారు. బయాలజీ ఉపాధ్యాయులకు గణితం, భౌతిక శాస్త్రంలో పరీక్షలు నిర్వహించడం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను, వారి మానసిక వేదనను అర్థం చేసుకొని పేపర్ 3 నిర్వహించి భాషోపాధ్యాయులకు న్యాయం చేయాలి. ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగులకు 60 మార్కులు, బిసిలకు 75 మార్కులు, ఒసిలకు 90 మార్కులు రావాలనడం సమంజసంగా లేదు.
ఏ పరీక్షలలోనైనా 35 మార్కులకే ఉత్తీర్ణత ఉంటుంది. అలాంటిది టెట్‌లో 90 మార్కులు రావాలన్న నియమం ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తుంది. కులప్రాతిపదికన మార్కులు కేటాయించడం ఏ పరీక్షలలోనూ లేదు. ఒక పాఠశాలలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఒసి నలుగురు ఉపాధ్యాయులు ఉంటే నలుగురిలో ఎస్‌సి, ఎస్‌టి ఉపాధ్యాయులకు 65% మార్కులు, బిసి ఉపాధ్యాయుడికి 77 మార్కులు, జనరల్ (ఒసి) ఉపాధ్యాయుడికి 89 మార్కులు అందరి కంటే ఎక్కువ వచ్చినప్పటికీ ఎస్‌సి, ఎస్‌టి, బిసి ఉపాధ్యాయులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించి జనరల్ ఉపాధ్యాయుడు ఉత్తీర్ణత కాలేదు అనడం విశేషం. సమాజం దృష్టిలో, విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టిలో, వారి భార్యాబంధువుల దృష్టిలో టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించని ఉపాధ్యాయుడిగా చిన్నచూపు. టెట్ పరీక్ష అంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష 25, 30 సంవత్సరాల నుండి పదవ తరగతి విద్యార్థులకు బోధించి, ఉత్తమ పౌరులను తయారు చేసి కొంత మంది విద్యార్థులే ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించేటట్లు సలహాలు, సహకారం అందించి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం చేత, స్వేచ్ఛంద సంస్థల చేత ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానింపబడి టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించనంత మాత్రాన ఉపాధ్యాయ వృత్తికి పనికి రాడనడం ఏ రకమైన నీతి, న్యాయం, ధర్మమో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొంత మంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సిఆర్‌టిఇ) ఆధ్వర్యంలో పుస్తక రచయితలుగా ఉన్నవారు టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించలేడు కాబట్టి ఉపాధ్యాయుడిగా అర్హత లేదు అనడం సమంజసమేనా? భాషోపాధ్యాయులు (తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడం, తమిళం ఇతర దేశీయ భాషలు)బయోలజీ బోధించే ఉపాధ్యాయులకు వారు బోధించే సబ్జెక్టులో టెట్ పరీక్షను నిర్వహించకుండా వారికి సంబంధం లేని ఆంగ్లం, సాంఘికశాస్త్రం, గణితం, భౌతిక శాస్త్రం, మానసిక శాస్త్రంలో పరీక్షలను నిర్వహించి ఉత్తీర్ణత సాధించాలని అనడం విచారించదగిన విషయంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెట్ పరీక్ష ఉపాధ్యాయ అర్హత పరీక్ష మాదిరిగా డాక్టర్ అర్హత పరీక్ష, న్యాయవాద అర్హత పరీక్ష, ఇంజినీర్ అర్హత పరీక్ష అంటూ ఏ వృత్తిలో లేని అర్హత పరీక్ష ఉపాధ్యాయులకు మాత్రమే నిర్వహించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టెట్ ఉత్తీర్ణత సాధించకుంటే పదోన్నతి రాదనడం, ఉద్యోగం వదులుకోవలనడం ఇదేమి న్యాయమని అనేకమంది ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. విద్య ఉమ్మడి జాబితాలో ఉండడంవల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన విధానం అమలు చేస్తుందో అని ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీచర్స్‌గా 2010 కంటే ముందు ఉన్న వాళ్ళకు టెట్‌నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టిఆర్‌టిఎఫ్) ఆధ్వర్యంలో దేశరాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పదవీవిరమణ చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు నగదు రహిత హెల్త్ కార్డుల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం గొప్ప పరిణామంగా వారు భావిస్తున్నారు.
– ఎస్. విజయ భాస్కర్-
-9290826988