Reading Time: 3 minutes

తెలంగాణ విజన్ 2047, సమగ్ర అభివృద్ధి, మానవ వనరుల వికాసం, సమాన అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ లక్ష్యాలను సాధించడంలో గిరిజన యువతపై రాష్ట్రం చేసే పెట్టుబడి చాలా కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటివరకు తగిన విధంగా వినియోగించుకోని, అపార సామర్థ్యం కలిగిన గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడం విజన్- 2047 అమలులో ప్రధాన అంశంగా మారాల్సిన అవసరం ఉంది. జనగణన, రాష్ట్ర అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజనుల జనాభా 32.70 లక్షలు ఉంది. ఇది రాష్ట్ర జనాభాలో సుమారు 10 శాతం. ఇందులో 70 శాతం కంటే ఎక్కువ మంది షెడ్యూల్డ్ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాలలో నివసిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన జనాభాలో 55 శాతం పైగా 30 సంవత్సరాల లోపు యువత ఉండటం రాష్ట్రానికి ఒక పెద్ద వరంగా చెప్పవచ్చు. అయితే విద్య, ఉపాధి వంటి రంగాల్లో ఉన్న నిర్మాణాత్మక అసమానతల వల్ల ఈ మానవ వనరు పూర్తిగా సత్ఫలితాలుగా మారడం లేదు. తెలంగాణలో గిరిజనుల అక్షరాస్యత రేటు సుమారు 63 శాతమే ఉండగా, రాష్ట్ర సగటు అక్షరాస్యత 72 శాతానికి పైగా ఉంది. అలాగే మాధ్యమిక స్థాయిలో గిరిజన ప్రాంతాల్లో పాఠశాల విడిచిపెట్టే గిరిజన విద్యార్థుల శాతం ఇంకా ఎక్కువగానే ఉంది.

గిరిజన యువతలో సుమారు 70 శాతం మంది వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడుతూ, రైతులుగా లేదా దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. దీనివల్ల ఆదాయ భద్రత లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. గిరిజన యువతలో దాదాపు 15 శాతం కన్నా తక్కువ మందికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ నైపుణ్య శిక్షణ లభించిందన్న అంచనాలు ఉన్నాయి. తయారీ, సేవలు, సాంకేతిక రంగాల్లో వారి భాగస్వామ్యం చాలా తక్కువ. ఇది రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధికి సవాలుగా ఉండగా, వ్యూహాత్మక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఈ పరిస్థితిని మార్చగలవు.

గిరిజనుల సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యత అంశాలు: తెలంగాణ విజన్ -2047 రాష్ట్రాన్ని ఆవిష్కరణలు, హరిత వృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, జ్ఞానాధారిత పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడిని సాధికారతకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల సమగ్ర అభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదల, స్థిరమైన జీవనోపాధుల సాధనకు ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సాధికారత అనే మూడు ప్రధాన రంగాలు కీలకం. వీటి ద్వారా వారి దీర్ఘకాలిక అభివృది, సుస్థిర జీవనం సాధ్యమై, భరోసా కలుగుతుంది. ఈ భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు గిరిజన యువతను అనుసంధానించాలంటే, సంప్రదాయ వృత్తులకే పరిమితం కాకుండా పునరుత్పాదక ఇంధనం, అగ్రి-ప్రాసెసింగ్, ఆహార విలువ గొలుసులు, ఆరోగ్య సేవలు, నిర్మాణ రంగం, లాజిస్టిక్స్, డిజిటల్ సేవలు, ఎకో-టూరిజం వంటి కొత్త రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించాలి. ప్రతి ఏడాది కనీసం లక్ష మంది గిరిజన యువతకు ఉపాధి కలిగించే నైపుణ్యాలు అందిస్తే, కుటుంబ ఆదాయాలు గణనీయంగా పెరగడమే కాకుండా స్థానిక ఉపాధి కల్పించడం ద్వారా షెడ్యూల్డ్ ప్రాంతాల నుంచి వలసలు పూర్తిగా తగ్గించవచ్చు.

సంప్రదాయ జీవనోపాధి బలోపేతం ఆవశ్యకత: స్థానిక పరిస్థితులకు, గిరిజన సంస్కృతి, జీవన విధానాలకు అనుగుణమైన శిక్షణా కార్యక్రమాలు అవసరం. గిరిజన ప్రాంతాల్లో సహజ వనరులు, మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. చిన్న అటవీ ఉత్పత్తులు, వెదురు, ఔషధ మొక్కల ఆధారిత ఉత్పత్తులు, హస్తకళలు, సంప్రదాయ కళలలో విలువ జోడింపు చేయగలిగితే స్థిరమైన జీవనోపాధులు ఏర్పడతాయి. ఆధునిక నైపుణ్యాలు, నాణ్యత ధ్రువీకరణ, బ్రాండింగ్, మార్కెట్ అనుసంధానం కల్పిస్తే అటవీ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయం 30 -50 శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా గిరిజన యువతతోపాటు గిరిజన మహిళలకు కూడా ప్రత్యక్ష లాభం చేకూరుతుంది.

గిరిజన యువతకు డిజిటల్ విద్య: ప్రభుత్వ పాలన, విద్య, ఉపాధి రంగాలు డిజిటలైజ్ అవుతున్న తరుణంలో డిజిటల్ భాగస్వామ్యం అత్యంత కీలకం. డిజిటల్ విద్య లేమి గిరిజన యువతను వెనుకబాటుకు నెట్టే ప్రమాదం ఉంది. గిరిజన గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగం, డిజిటల్ పరిజ్ఞానం రాష్ట్ర సగటుతో పోలిస్తే తక్కువగా ఉంది. ప్రాథమిక డిజిటల్ నైపుణ్యాలు, ఐటి సేవలు, మౌలిక సదుపాయాలు అందిస్తే మారుమూల గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆధారిత ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇదివిజన్- 2047లో ఊహించిన జ్ఞాన ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా ఉంటుంది.

నైపుణ్యాభివృద్ధి ఫలితాలు సాధించాలంటే అనుబంధ కార్యక్రమాలు కూడా కీలకం. ప్రాథమిక, మాధ్యమిక విద్య బలోపేతంచేయడంతో పాటు, పోషణ, ఆరోగ్యం, భాషా మాధ్యమం, ఆర్థిక చేకూర్పు వంటి అంశాలు శిక్షణను ఉపాధిగా మారుస్తాయి. గిరిజన మహిళలు,ఆదిమ గిరిజన తెగలు (పివిటిజిఎస్)పై ప్రత్యేక దృష్టి పెట్టడం అత్యవసరం. ఎందుకంటే వారు అనేక స్థాయిల్లో వెనుకబాటుకు గురవుతున్నప్పటికీ సమాజ స్థిరత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ విజన్- 2047 విజయవంతం కావాలంటే అభివృద్ధి ఫలాలు అత్యంత మారుముల, ఏజెన్సీ ప్రాంతాలలోన ఉన్న, అట్టడుగు వర్గాల వరకు చేరాలి. గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడం కేవలం సంక్షేమ చర్య కాదు, ఇది దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ది వ్యూహం. డేటా ఆధారిత ప్రణాళిక, బలమైన సంస్థాగత వ్యవస్థలు, పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణతో గిరిజన యువతను నైపుణ్యవంతులైన ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్ద గలదు. అలా గిరిజన యువతను రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో క్రియాశీల భాగస్వాములుగా 2047 నాటికి సమృద్ధి, సమానత్వం, స్థిరత్వం కలిగిన తెలంగాణను నిర్మించవచ్చు.

– మామిడాల లక్ష్మీప్రసాద్

88976 83592