
అమరావతి: ప్రేమ విషయం ఇంట్లో చెప్పిందనే కోపంతో ఓ యువకుడు దుకాణాన్ని తగలబెట్టాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తంతడి గ్రామంలో శేఖర్ అనే యువకుడు నివసిస్తున్నాడు. ఓ యువతిని శేఖర్ ప్రేమిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన యండపల్లి లక్ష్మికి కిరాణా దుకాణం నిర్వహిస్తోంది. శేఖర్ ప్రేమాయణం లక్ష్మీకి తెలియడంతో తల్లిదండ్రులకు అతడి గురించి చెప్పింది. దీంతో తల్లిదండ్రులు తన కుమారుడిని నిలదీయడంతో నీళ్లు నమిలాడు. తన ప్రేమ విషయం లక్ష్మీ చెప్పిందని కోపంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. కిరాణా దుకాణాన్ని తన స్నేహితుడు సాయితో శేఖర్ కలిసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.