
ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లా సురీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున 2.45 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు ప్రయాణికుల విరామం కోసం రహదారి పక్కన ఆగింది. ప్రయాణికులు బస్సు దిగి బయట నిల్చుని ఉండగా ఒక కంటైనర్ మితిమీరిన వేగంతో అదుపు తప్పి ప్రయాణికుల పైకి దూసుకు రావడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ట్రక్కు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.