
సెంట్రల్ సూడాన్‌లో శనివారం నిర్వాసిత కుటుంబాలతో వెళ్తున్న వాహనంపై పారామిలిటరీ గ్రూపు డ్రోన్ దాడి చేయడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారని డాక్టర్ల గ్రూపు వెల్లడించింది. నార్త్ కొర్డోఫాన్ ప్రావిన్స్‌లో రహాద్ సిటీ సమీపాన రాపిడ్ సపోర్టు ఫోర్స్‌స్ ఈ దాడికి పాల్పడ్డాయి. నార్త్ కొర్డోఫాన్ లోని డుబెయికర్ ఏరియా యుద్ధ ప్రాంతం నుంచి తరలిపోతున్న నిర్వాసితులపై ఈ దాడి జరిగిందని డాక్టర్ల గ్రూపు పేర్కొంది. తక్షణం ప్రజలను రక్షించడానికి అంతర్జాతీయ సమాజం, హక్కుల సంఘాలు చొరవ తీసుకుని ఆర్‌ఎస్‌ఎఫ్ నాయకత్వాన్ని ఈ ఉల్లంఘనలకు జవాబుదారీ చేయాలని కోరింది.అయితే ఆర్‌ఎస్‌ఎఫ్ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు.
దేశాన్ని నియంత్రించడానికి గత మూడేళ్లుగా సూడానీస్ మిలిటరీకి వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎఫ్ పోరు సాగిస్తోంది. 2023 నుంచి సూడాన్‌లో అధికారం కోసం మిలిటరీకి, ఆర్‌ఎస్‌ఎఫ్ మధ్య యుద్దం సాగుతోంది. రాజధాని ఖర్టోమ్ లో దేశం లోని మిగతా ప్రాంతాల్లోనూ బహిరంగ పోరు సాగుతోంది. ఈ యుద్ధం వల్ల దాదాపు 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం మొత్తం మీద సూడాన్‌లో భారీ మానవతా సంక్షోభం నెలకొంది. దాదాపు 14 మిలియన్ మంది బలవంతంగా తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది. దీంతో వ్యాధులు విజృంభించడమే కాకుండా దేశం లోని అనేక ప్రాంతాలు దుర్భిక్షానికి గురయ్యాయి.