
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని బిఆర్ఎస్, బిజెపి ఎప్పుడూ ఆలోచించలేదని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో సిఎం పర్యటించారు. నారాయణపూర్ లో ‘ప్రజా పాలన-ప్రగతి బాట’ బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని, బిఆర్ఎస్ హయాంలో మున్సిపాలిటీలను పట్టించుకోలేదని విమర్శించారు. గల్లీలో బిజెపి కార్పొరేటర్ గెలిస్తే.. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి సమస్యలు పరిష్కరిస్తాడా? అని ఓట్లు కావాల్సి వచ్చాయి కానీ.. సమస్యలు ఏనాడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని, బిఆర్ఎస్, బిజెపి కలిసి కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.
పదేళ్లు మంత్రిగా ఉన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్.. ఏనాడైనా మున్సిపాలిటీలను పట్టించుకున్నారా? అని కెటిఆర్ కు ఇన్నాళ్లూ వికారాబాద్, తాండూరు ఎందుకు గుర్తు రాలేదు? అని నిలదీశారు. 2014, 2018 లో సబితా ఇంద్రా రెడ్డికి కాంగ్రెస్ అండగా నిలిచిందని తెలియజేశారు. కాంగ్రెస్ బీఫామ్ పై గెల్చి సబితా ఇంద్రారెడ్డి బిఆర్ఎస్ లోకి వెళ్లిందని రేవంత్ అన్నారు. రోజమ్మ రొయ్యల పులుసు తిని రాయలసీమని రతనాల సీమ చేస్తా అని మాజీ సిఎం కెసిఆర్ అన్నారని, రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను రాకుండా కెసిఆర్ అడ్డుకున్నా మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి వికారాబాద్ కు గోదావరి జలాలను తీసుకురాలేదని, 300 టిఎంసిల గోదావరి జలాలు ఇస్తే 30 లక్షల ఎకరాలు పండేవని, కెసిఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైందని కాళేశ్వరంలో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని, కాళేశ్వరం మూడేళ్లలోనే కూలేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పేరుతో రూ. వేలకోట్లు దోచుకున్నారని, లక్ష్మీదేవి పల్లి దగ్గర రిజర్వాయర్ కడతానని భూసేకరణ చేయలేదని, గోదావరి జలాల ముసుగులో రూ. వేల కోట్లు కొల్లగొట్టారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.