Reading Time: 2 minutes

ఫిబ్రవరి 1, 2026న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2026 -27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం వ్యయం రూ. 53.47 లక్షల కోట్లుగా ప్రకటించిన ఈ బడ్జెట్, గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 8 శాతం పెరుగుదలగా నమోదైంది. దేశవ్యాప్తంగా మౌలిక వసతులు, రక్షణ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఈ బడ్జెట్ తెలంగాణకు మాత్రం మిశ్రమ ఫలితాలను ఇచ్చిందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం 2026 -27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం వ్యయం రూ. 53.47 లక్షల కోట్లుగా ప్రకటించింది. కొన్ని రంగాల్లో అవకాశాలు కనిపించినా, రాష్ట్ర ప్రత్యేక అవసరాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. బడ్జెట్‌లో క్యాపిటల్ ఖర్చు రూ. 12.2 లక్షల కోట్లకు పెంచడం ప్రధాన ఆకర్షణ. ఇందులో రహదారులు, రైల్వేలు, లాజిస్టిక్స్ రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. రైల్వే శాఖకు మొత్తం రూ. 2.81 లక్షల కోట్లు కేటాయించగా, అందులో తెలంగాణకు రూ. 5,454 కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం ప్రకటించింది. కొత్త రైలు మార్గాలు, స్టేషన్ అభివృద్ధి, ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టులు రాష్ట్రానికి కొంత ప్రయోజనం కలిగించే అవకాశముంది.

ముఖ్యంగా హైదరాబాద్-వరంగల్ -ఖమ్మం పారిశ్రామిక బెల్ట్‌కు ఇది అనుకూలంగా మారవచ్చు. అయితే వ్యవసాయ రంగం విషయంలో ఈ బడ్జెట్ తెలంగాణ రైతులకు తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించింది. వ్యవసాయానికి మొత్తం కేటాయింపు రూ. 1.62 లక్షల కోట్లు మాత్రమే, ఇది మొత్తం బడ్జెట్‌లో కేవలం 3 శాతం కూడా కాదు. గత ఏడాదితో పోలిస్తే ఈ మొత్తం తగ్గడమే గాక, ఎరువుల సబ్సిడీకి రూ. 1.35 లక్షల కోట్ల నుంచి రూ. 1.25 లక్షల కోట్లకు తగ్గించారు. పంట బీమా పథకానికి కేవలం రూ. 12,200 కోట్లు మాత్రమే కేటాయించడమే రైతులకు పెద్ద షాక్. సాగునీటి ప్రాజెక్టులు, మద్దతు ధరలపై ప్రత్యేక ప్రణాళిక లేకపోవడం తెలంగాణ వంటి వ్యవసాయాధారిత రాష్ట్రానికి తీవ్రమైన లోపంగా మారింది. ప్రత్యేకంగా తెలంగాణలో ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తి పంట విషయంలో కేంద్ర బడ్జెట్ పూర్తిగా మౌనం వహించింది. దేశంలో అత్యధిక పత్తి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో లక్షలాది రైతులు పత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయినా పత్తికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ను వాస్తవ ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా పెంచలేదు. ప్రస్తుతం పత్తి సాగు ఖర్చు క్వింటాల్‌కు సుమారు రూ. 7,500 నుంచి -రూ. 8,000 వరకు ఉండగా, ఎంఎస్‌పి మాత్రం దాని కంటే తక్కువగానే ఉంది. దీంతో రైతులకు లాభం కంటే నష్టం ఎక్కువగా మిగులుతోంది.

మరోవైపు పత్తి రైతులకు అవసరమైన పత్తి కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు, ఎగుమతి మౌలిక వసతుల గురించి బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టమైన కేటాయింపులు లేవు. విదేశీ పత్తి దిగుమతులపై నియంత్రణ లేకపోవడం వల్ల దేశీయ మార్కెట్ ధరలు పడిపోతున్నాయి. ఇది తెలంగాణ పత్తి రైతులను మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉంది. పత్తి ఆధారిత టెక్స్‌టైట్స్ పరిశ్రమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోవడం కూడా పెద్ద లోపమే. గ్రామీణ అభివృద్ధి కోసం కేంద్రం ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎకు రూ. 86,000 కోట్లు కేటాయించింది. ఇది సంఖ్యల పరంగా ఎక్కువగానే కనిపించినా, ధరల పెరుగుదల దృష్ట్యా ఈమొత్తం సరిపోదని నిపుణుల అభిప్రాయం. గ్రామీణ రహదారులు, తాగునీటి పథకాలకు నిధులు కొనసాగించినా, కొత్త ప్రాజెక్టులు ప్రకటించకపోవడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతం ఇవ్వలేకపోయింది. ఐటీ, డిజిటల్ రంగాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించినా, తెలంగాణకు ప్రత్యేకంగా పెద్ద ప్రాజెక్టులు లేకపోవడం నిరుత్సాహకరం. స్టార్టప్‌లు, డీప్‌టెక్ ఫండ్‌లు ఉన్నప్పటికీ, హైదరాబాద్ వంటి ఐటి హబ్‌కు నేషనల్ లెవల్ ప్రాజెక్టులు రాకపోవడం కేంద్రం చిన్నచూపును ప్రతిబింబిస్తోంది. మొత్తంగా కేంద్ర బడ్జెట్ -2026 తెలంగాణకు కొంత మౌలిక వసతుల అభివృద్ధిని అందించినప్పటికీ, వ్యవసాయం, -ప్రత్యేకంగా పత్తిరైతుల విషయంలో -తీవ్ర నిరాశను మిగిల్చింది.

రైతు ఆదాయం రెట్టింపు అనే నినాదాలు కాగితాలకే పరిమితమై, భూమిపై ఉన్న వాస్తవ పరిస్థితులకు ఈ బడ్జెట్ పెద్దగా దోహదపడలేదు. రాష్ట్ర అభివృద్ధి నిజంగా కావాలంటే, కేంద్రం తెలంగాణ వ్యవసాయం, పత్తి మార్కెట్, గ్రామీణ జీవనాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలతో ముందుకు రావాల్సిన అవసరం ఇప్పటికైనా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా కేంద్ర బడ్జెట్ -2026 తెలంగాణకు కొంత మౌలిక వసతుల అభివృద్ధిని ఇచ్చినప్పటికీ, వ్యవసాయం -ప్రత్యేకంగా పత్తి రైతుల విషయంలో-తీవ్ర నిరాశనే మిగిల్చింది. రైతు ఆదాయం పెంపు, గ్రామీణ పునరుజ్జీవనం, సామాజిక రంగాల బలోపేతం వంటి కీలక అంశాలు మాటలకే పరిమితమయ్యాయి. ఈ బడ్జెట్ రాష్ట్రానికి పెద్ద ప్రాజెక్టుల ఆశలు చూపించి, ప్రజల జీవిత సమస్యలను విస్మరించిన బడ్జెట్‌గా మిగిలిపోతుంది. తెలంగాణకు నిజమైన సమగ్ర అభివృద్ధి కావాలంటే, కేంద్రం ఇకనైనా రాష్ట్ర అవసరాలను అర్థం చేసుకుని లక్షిత నిధులు, ప్రత్యేక ప్యాకేజీలతో ముందుకు రావాల్సిన అవసరం కావాలనే డిమాండ్ చేస్తోంది. 

– ఆత్మకూరి ప్రశాంత్ చారి

79894 21153