Reading Time: 2 minutes

ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సామాజిక వర్గాలపై తీవ్ర ప్రభావం చూపిన అంశాల్లో ఇటీవలి కాలంలో ఎప్‌స్టీన్ ఫైల్స్ ఒకటి. లైంగిక దోపిడీ, బాలల అక్రమ రవాణా, శక్తివంతుల రహస్య నెట్‌వర్కులు, న్యాయ వ్యవస్థల వైఫల్యాలు ఇవన్నీ ఒకేచోట బయటపడటమే ఈ ఫైల్స్‌ను అంతర్జాతీయంగా సంచలనంగా మార్చాయి. అమెరికా నుంచి యూరప్ వరకూ మీడియా, పౌరసంఘాలు, మానవ హక్కుల సంస్థలు ఈ అంశాన్ని తీవ్రంగా చర్చిస్తున్నాయి. కానీ అదే సమయంలో భారతీయ ప్రధాన మీడియా ఈ విషయంలో చూపుతున్న మౌనం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. అమెరికాలో జెఫ్రీ ఎప్‌స్టీన్ అరెస్టు, ఆపై అతని అనుమానాస్పద మరణం జరిగినప్పటినుంచే అనుమానాలు మొదలయ్యాయి. కానీ తాజాగా బయటకు వచ్చిన కోర్టు డాక్యుమెంట్లు, సాక్ష్యాలు, ఇమెయిల్స్, ప్రయాణ వివరాలు ‘ఎప్‌స్టీన్’ ఒక వ్యక్తి మాత్రమే కాదని, అతడు కేంద్రంగా పనిచేసిన ఒక విస్తృతమైన శక్తివంతుల వలయం ఉందని ప్రపంచానికి స్పష్టంచేశాయి. రాజకీయ నాయకులు, బిలియనీర్లు, కార్పొరేట్ అధినేతలు, హాలీవుడ్ ప్రముఖులు ఇలా అనేక రంగాలలో ప్రముఖుల పేర్లు ఈ ఫైల్స్‌లో ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ప్రస్తావనకు రావడం అమెరికా సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ప్రధాన పత్రికలు దీనిపై లోతైన కథనాలు రాశాయి. ‘న్యూయార్క్ టైమ్స్’, ‘ది గార్డియన్’, ‘వాషింగ్టన్ పోస్ట్’ వంటి పత్రికలు ఈ ఫైల్స్‌ను న్యాయవ్యవస్థ పారదర్శకత, ధనిక-పేద మధ్య న్యాయ అసమానతకు ఉదాహరణగా విశ్లేషించాయి. పౌరహక్కుల కార్యకర్తలు ఇది కేవలం లైంగిక నేరాల అంశం మాత్రమే కాదు; అధికారాన్ని దుర్వినియోగం చేసే గ్లోబల్ ఎలైట్ వ్యవస్థను బయటపెట్టే క్షణంగా అభివర్ణించారు. సామాజిక మాధ్యమాల్లో బాధితులకు న్యాయం (జస్టీస్ ఫర్ విక్టిమ్స్’) అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. యూరప్‌లోనూ ఇదే స్పందన కనిపించింది. ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఎప్‌స్టీన్ వ్యవహారం మహిళల భద్రత, బాలల రక్షణపై ఉన్న చట్టాల ప్రభావాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు కూడా మానవ అక్రమ రవాణా వ్యతిరేక చర్యల్లో అంతర్జాతీయ సహకారం ఎంత కీలకమో ఈ ఉదంతం చూపించిందని వ్యాఖ్యానించాయి.

ఇంతటి ప్రపంచ చర్చ జరుగుతున్నప్పటికీ, భారతీయ ప్రధాన మీడియా మాత్రం ఈ అంశాన్ని పక్కన పెట్టినట్టే కనిపిస్తోంది. కొద్ది ఆన్‌లైన్ పోర్టల్స్ లేదా స్వతంత్ర జర్నలిస్టులు తప్ప, టెలివిజన్ చర్చలు గానీ, ప్రధాన పత్రికల ఫ్రంట్ పేజీలు గానీ ఎప్ స్టీన్ ఫైల్స్‌ను గంభీరంగా తీసుకున్న దాఖలాలు చాలా తక్కువ. దీనికి కారణం ఏమిటన్న ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. అంతర్జాతీయ శక్తిమంతులతో సంబంధాలున్నాయన్న భయం? లేక దేశీయ రాజకీయ అజెండాలకు సరిపోని విషయం కావడమేనా? భారతీయ మీడియా మౌనం మరింత ఆందోళన కలిగించేది మరో కోణంలో. ఈ ఫైల్స్‌లో భారతీయులకు సంబంధించిన పరోక్ష ప్రస్తావనలు, వ్యాపార సంబంధాలపై వచ్చిన వార్తలు కూడా పూర్తిస్థాయిలో చర్చకు రాలేదు. ప్రపంచీకరణ యుగంలో, గ్లోబల్ ఎలైట్ నెట్‌వర్క్‌లు దేశ సరిహద్దులను లెక్కచేయవు. అటువంటి సందర్భంలో ఇది మన విషయం కాదు అన్న నిర్లక్ష్యం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రపంచానికి ఒక కఠినమైన నిజాన్ని చెబుతున్నాయి ‘ధనం’, ‘అధికారం’ కలిసినప్పుడు ‘న్యాయం’ ఎంత సులభంగా అణచివేయబడుతుందో. ‘న్యాయ వ్యవస్థలు’, ‘మీడియా’, ‘ప్రభుత్వాలు’ నిజంగా స్వతంత్రంగా పనిచేయకపోతే, బాధితుల గొంతులు ఎంత సులభంగా మూగబోయే అవకాశముందో ఈ ఉదంతం చూపించింది.

అందుకే పాశ్చాత్య దేశాల్లో ఇది కేవలం స్కాండల్‌గా కాకుండా, ఒక వ్యవస్థాపక వైఫల్యంగా చర్చకు వచ్చింది. 145 కోట్ల జనాభా ఉన్న భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో మీడియా పాత్ర మరింత కీలకం. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా, మానవ హక్కులకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వేయడం, ప్రజలను అవగాహన కల్పించడం మీడియా బాధ్యత. ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై భారతీయ మీడియా మౌనం, నిజానికి మన మీడియా ప్రాధాన్యతలను, దాని స్వతంత్రతను, దాని ధైర్యాన్ని ప్రశ్నించే అంశంగా మారింది. ఈ ఫైల్స్ మనకు ఒక హెచ్చరిక. న్యాయం ధనికుల ఇంటి ద్వారంలో ఆగిపోకూడదు. బాధితుల కథలు దేశాల సరిహద్దులు దాటినా, మన మనసుల్లో ప్రతిధ్వనించాలి. ప్రపంచం ఈ స్కాండల్‌ను ఒక మలుపుగా తీసుకుంటే, భారత సమాజం మాత్రం దానిని ‘చూసి కూడా చూడనట్టు’ గా మౌనంగా ఉండటం భవిష్యత్తుకు మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో విజ్ఞానం, వివేచన గల మేధావులు సైతం మౌనంగా ఉండటం కూడా ఒక రాజకీయ వైఖరే కావచ్చు. కానీ అది అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అయిన భారత్‌కు క్షేమకరం కాదు. మన దేశంలో మీడియా అది ఎవరికి అనుకూలంగా పనిచేస్తుందో మనం ఆలోచించాల్సిన సమయం ఇదే.

– కోలాహలం రామ్ కిశోర్

9849328496