
గ్రీన్‌లాండ్ విషయమై అమెరికా తీరు చూసి కొందరికి యూరప్ పట్ల సానుభూతి కలుగుతున్నట్లు కనిపిస్తున్నది. అమెరికా తీరు ఏ విధంగా చూసినా ఖండించదగినదన్నది నిజమే. దేశాల మధ్య సంబంధాలు, నాటో దేశాలు మధ్య అనుబంధాలు, అంతర్జాతీయ చట్టాలు అనే ఏ కొలబద్ద ప్రకారమైనా అది ఎంతమాత్రం ఆమోదనీయం కాదు. కనుక ఆ మేరకు చూసినపుడు మాత్రం యూరప్‌ను బలపరచవచ్చు. అదే సమయంలో మొత్తం పరిణామాలకు విస్తృత పరిధి కూడా ఒకటుంది. అది ఉపేక్షించదగినది ఎంతమాత్రం కాదు. ఆ కోణం నుంచి పరిశీలించినపుడు యూరప్‌పై సానుభూతి చూపవలసిందేమీ కనిపించదు. ఎందుకంటే, అమెరికా ఎంత సామ్రాజ్యవాదో యూరప్ కూడా అంతకు తీసిపోని సామ్రాజ్యవాది. ఇంకా చెప్పాలంటే అమెరికా కన్నా సీనియర్ సామ్రాజ్యవాది. యూరప్ సామ్రాజ్యవాదం 500 సంవత్సరాల క్రితం మొదలు కాగా, అమెరికాది మొదలై ఇంకా వందేళ్లు కాలేదు. అంతకన్న ముఖ్యమేమంటే, యూరప్ సామ్రాజ్య వాదం ఎప్పటిదో కదా అని మరవటానికి వీలు లేకుండా ఈ రోజు వరకు కొనసాగుతున్నది. అందువల్ల, అంతర్జాతీయ నియమ నిబంధనలు అనే కోణంనుంచి కాస్త పక్కకు జరిగి మరొక స్థాయిలో చూస్తే, గ్రీన్‌లాండ్ వ్యవహారం సామ్రాజ్యవాద శిబిరంలో తలెత్తిన అంతర్గత వివాదం వంటిది.
కొన్ని విషయాలను గమనిద్దాం. ఒక నాటో దేశమైన డెన్మార్క్‌కు చెందిన గ్రీన్‌లాండ్‌ను అమెరికా బల ప్రయోగంలోనైనా ఆక్రమించుకోచూడటం సామ్రాజ్యవాదమని యూరప్ విమర్శిస్తున్నది. ఇంతకూ డెన్మార్క్ గాని, యూరప్‌గాని గ్రీన్‌లాండ్ విషయంలో మాత్రమే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకమా లేక మౌలికంగానే ఆ విధానాలకా? గ్రీన్‌లాండ్ విషయంలో మాత్రమే అయితే అందుకు విలువ, నైతిక బలం ఉండవు. అట్లా గాక మౌలికంగానైతే వెంటనే తమ సామ్రాజ్యవాదాన్ని కూడా వదలివేయాలి. వార ఈ ద్వంద్వ ధోరణి అనేక విషయాలలో మరొక వైపు కొనసాగుతునే ఉన్నది. గ్రీన్‌లాండ్ అనే దీవి యూరప్‌కు పశ్చిమాన ఉండగా తూర్పున గల ఉక్రెయిన్ విషయమేమిటి? ఒకప్పటి సోవియెట్ యూనియన్ నాయకత్వాన ఉండిన వార్సా సైనిక కూటమి 1991 లోనే రద్దు కాగా, పాశ్చాత్య దేశాల నాటో కూటమిని ఇంకా కొనసాగించటం, అందులో ఉక్రెయిన్‌ను చేర్చుకుని రష్యాను చుట్టుముట్ట జూడటం వల్ల కాదా ఆ యుద్ధం మొదలైంది? ఈ మాట స్వయంగా ట్రంప్ కూడా ఇపుడు అంగీకరిస్తున్నారు గదా. మరి ఈ విధమైన తమ సామ్రాజ్య వాదానికి యూరప్ చెప్పేదేమిటి? తమది ఒప్పు అయి ట్రంప్‌ది ఎట్లా తప్పవుతుంది?
ఇటువంటి దృష్టాంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. గాజాలో జరుగుతున్న నిరంతర మారణహోమం, వెస్ట్‌బ్యాంక్ ఆక్రమణల విషయమై యూరోపియన్ యూనియన్‌కు ఉమ్మడి వైఖరి ఏమైనా ఉందా? అమెరికా నాయకత్వాన మొత్తం యూరప్ తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ఇజ్రాయెల్‌ను సృష్టించి ఉపయోగించుకుంటుండగా గాజాలో మారణకాండకు ఆయుధాలను, నిధులను ఎందుకు సరఫరా చేస్తున్నారు? రష్యా చమురు కొనుగోళ్ల ద్వారా భారత నిధులు ఉక్రెయిన్ యుద్ధానికి అందుతున్నాయనే వాదనలు అమెరికాతో కలిసి చేస్తున్న యూరప్ దేశాలు, ఇజ్రాయెల్‌తో వ్యాపారం, పెట్టుబడులు కొనసాగించటం వల్ల గాజాపై యుద్ధానికి నిధులు సమకూర్చటం లేదా? అక్కడ 80,000 మంది పౌరులలు చనిపోయి ఐక్యరాజ్యసమితి సహా ప్రపంచమంతా ఖండిస్తున్నా తమ సామ్రాజ్యవాద విధానాలను కొనసాగించటం లేదా? యూరప్‌లోని ఏవో కొన్ని మినహా మొత్తం 27 దేశాల యూరోపియన్ యూనియన్ పాలస్తీనాను గుర్తించనిది ఎందుకు?
ఇవే రోజులలో జరిగిన వెనెజువెలా ఉదంతం అసాధారణమైన సామ్రాజ్యవాదం కాదా? ఒక స్వతంత్ర దేశంపై దాడి జరిపి దేశాధ్యక్షుడిని అపహరించి, ఆయన అమెరికాకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారంటూ అసత్యపు ఆరోపణలు చేయటం సామ్రాజ్యవాదమేనని యూరోపియన్లు ఎందుకు ఖండించటంలేదు? 27 దేశాల సంఖ్యలో ఒకరిద్దరు మినహా? పనామా కాలువ పనామా అనే స్వతంత్ర దేశానికి చెందినది. ఆ దేశం యూరప్‌లో లేకపోవచ్చుగాని అదే పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఆ కాలువ మీదుగా సరకుల రవాణాలు యూరప్ లాటిన్ అమెరికాలోని పశ్చిమ ప్రాంతాల మధ్య అట్లాంటిక్ మీదుగా పెద్ద ఎత్తున సాగుతుంటాయి. అటువంటి స్థితిలో అమెరికా అధ్యక్షుడు పనామా ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తేవటం, ఆ కాలువను సైనికంగానైనా స్వాధీన పరచుకోగలమని బెదిరించటం, అమెరికన్ నౌకలపై సుంకాలు విధించటానికి వీలులేదని హెచ్చరించటం, తమకు నచ్చని రేవు నిర్వహణా కంపెనీలతో ఉండిన ఒప్పందాలను రద్దు చేయించటం వంటి దంతా సామ్రాజ్యవాదమని యూరోపియన్ దేశాలకు తోచలేదా?
ఇండో పసిఫిక్‌లో స్వేచ్ఛా నౌకాయానానికి అవకాశం ఉండాలని, అందుకు చైనానుంచి ఎటువంటి ఆటంకాలు కలగరాదని న్యాయంగానే వాదిస్తున్న యూరప్, అందుకోసం అమెరికాతో కలిసి పని చేస్తున్నదిగాని, ఇండో పసిఫిక్, దక్షిణ చైనా సముద్రాలవలెనే ఆర్కిటిక్ ప్రాంతం కూడా అంతర్జాతీయ సముద్రమని, అక్కడ కూడా రష్యా, చైనాలకు నౌకాయాన స్వేచ్ఛ ఉంటుందనే వైఖరిని ఎందుకు తీసుకోవటం లేదు? ఇదంతా అమెరికాతో కలిసి సాగించే ఉమ్మడి సామ్రాజ్యవాదం కాదా? అదే విధంగా ఒక విచిత్రం ఏమంటే, అమెరికా, తాము కూడా ఒకే చైనా సూత్రాన్ని బలపరుస్తారు. అనగా, చైనా అంతర్యుద్ధ కాలంలో విప్లవకారులతో ఓడిపోయిన చాంగ్ కైషేక్ వర్గం చైనాకే చెందిన తైవాన్‌కు పారిపోయి అక్కడ స్వతంత్ర దేశాన్నయితే ప్రకటించుకున్నా అది చెల్లుబాటు కాదని, ఆ ద్వీపం చైనాదేనని అంగీకరించటమన్నమాట. ఈ వాస్తవాల కారణంగానే ప్రపంచంలో సుమారు పది చిన్న దేశాలు మినహా అందరూ ఒకే చైనా సూత్రాన్ని గుర్తిస్తున్నారు. అదే విధంగా తాము కూడా ఒకవైపు గుర్తిస్తూనే మరొక వైపు తైవాన్‌తో సంబంధాలు నెరపటం, ఆయుధ సరఫరాల వంటివి సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం కాదా?
అమెరికాతోపాటు కొన్ని యూరోపియన్ దేశాలు నేటికీ కొన్ని వలసలను కొనసాగిస్తుండటం, ఆఫ్రికాలో ఫ్రాన్స్ వలస ఆధిపత్యం కొనసాగుదల, ప్రపంచమంతటా ఇరువురు కలసి సుమారు వెయ్యి సైనిక స్థావరాలను నిర్వహిస్తుండటం వంటివన్నీ సామ్రాజ్యవాదం గాక మరేమవుతుంది? ఇండియాకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే స్వేచ్ఛలేదంటూ ట్రంప్ వాదించి అదనపు సుంకాలు విధిస్తుండగా యూరోపియన్ యూనియన్ చేసినపనేమిటి? తాము కూడా వంద శాతం సుంకాలు విధిస్తామన్నది. ఇదంతా సామ్రాజ్యవాదం కాదా? ఇందులోని వింత ఏమంటే, మరొకవైపు స్వయంగా అమెరికా, యూరప్‌లు రష్యన్ ఇంధనాన్ని ఖరీదు చేస్తున్నాయి. ఆ మాటవారే అంగీకరిస్తున్నారు.
ప్రత్యక్ష వలసవాదం 1960 ల నాటికి ముగిసిపోయినా పరోక్ష వలసవాదం, నయా వలసవాదం, సామ్రాజ్యవాదాలను యూరోపియన్ దేశాలు అనేకానేక పేద దేశాలలో, చిన్న దేశాలలో నేటికీ కొనసాగించటం లేదా? రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెట్టన్ వుడ్స్ సమావేశాలతో ఆరంభించి డబ్లుటిఒ వరకు వారు సృష్టించిన అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య వ్వవస్థలన్నీ అమెరికా, యూరప్‌ల ఉమ్మడి సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే. గ్రీన్‌లాండ్ సందర్భంలో అమెరికాను నిరసిస్తున్న యూరోపియన్లు, పైన పేర్కొన్న అనేకానేక ఇతర సందర్భాలకు సంబంధించి తమ సామ్రాజ్యవాదాన్ని వదలుకోగలరా? ఆ పని చేయనపుడు వారికి కొన్ని టెక్నికల్ హక్కులు లభించవచ్చుగాని, నైతిక హక్కులేమీ ఉండవు. అవి కూడా కోరుకున్నట్లయితే యూరోఫియన్ ఒక ప్రత్యేక సమావేశం జరిపి, తమ చరిత్రను, వర్తమానాన్ని నిజాయితీగా సమీక్షించుకుని, చేస్తున్న తప్పులను అంగీకరించి ఇక నుంచి తమ తీరును మార్చుకోగలమని ప్రపంచం ఎదుట ప్రకటించాలి.
– టంకశాల అశోక్ (దూరదృష్టి)
– రచయిత సీనియర్ సంపాదకులు