
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్షలో భాగంగా పశ్చిమబెంగాల్ లోని ఓటర్ల జాబితాల్లోంచి వేలాది మంది ఓటర్లను అనర్హులుగా తొలగించిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ విరుద్ధంగా ఈ విధంగా తొలగించడం అన్యాయమని ధ్వజమెత్తుతూ దీనిపై తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడం సంచలనం కలిగించింది. నిజాయితీగా అర్హులైన ఓటర్లకు జాబితాలో చోటు లభించాలి. ఈమేరకు హామీ ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దే. ప్రత్యేక సమగ్ర సర్వే చేపట్టక ముందు పశ్చిమబెంగాల్ ఓటర్ల జాబితాలో 7.66 కోట్ల వరకు ఎంట్రీలు ఉండేవి. అందులోంచి 58 లక్షల పేర్లను తొలగించిన తరువాత ఎన్నికల కమిషన్ నమూనా జాబితాను ప్రకటించి 1.16 కోట్ల ఎంట్రీల్లో తార్కిక వైరుధ్యాలు ఉన్నాయని వెల్లడించింది. ఇది క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించి చేసిన ఒక ప్రయత్నం లేదా నిర్ణయాన్ని సమర్ధించుకోవడానికి ఉపయోగించే తప్పుడు సాకును తెలియజేస్తుందని చెప్పవచ్చు. ఈ పొంతనలేని అసంబద్ధమైన పదజాలాన్ని ఉపయోగించి ఎన్నికల సంఘం పశ్చిమబెంగాల్ ప్రజలను తమ పాలకులను ఎన్నుకునే హక్కు నుంచి దూరం చేయడమే అవుతుంది. ఓటు వేసే హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభంలా ఆచరణలో ఉంటోంది. భారత దేశం వివిధ భాషలు, మాండలికాలు కలిగిన బహుళ భాషా సమాజం.
ప్రపంచం లోనే అత్యధికంగా భాషా వైవిధ్యం కలిగిన దేశాల్లో ఒకటిగా భారత్ పరిగణించబడుతోంది. రాజ్యాంగం లోని 8వ షెడ్యూల్‌లో 22 భాషలకు గుర్తింపు కలిగినప్పటికీ దేశవ్యాప్తంగా వందలాది భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ భాషల్లో సరైన నామవాచకాలు రాసేటప్పుడు తేడాలు, అనివార్యమైన తప్పులు చోటు చేసుకోవచ్చు. పురుషులు, మహిళలు వయసులో తేడాలు, 15 ఏళ్ల కన్నా తక్కువ లేదా 50 ఏళ్ల వరకు తమ తల్లిదండ్రులకు తమకు తేడా ఉండవచ్చు. కొన్నిసార్లు దంపతులకు ఆరు లేదా అంతకన్నా ఎక్కువ సంతానం ఉండవచ్చు. చాలా మంది మహిళలు తమ పేరు చివరన తమ భర్త పేరు చేర్చుకుంటుంటారు. ఇవన్నీ భారత దేశ ప్రజాజీవనంలో వాస్తవాలే తప్ప ఓటర్ల జాబితాలో పేర్లను కొట్టేసినంత శక్తివంతమైన తార్కిక వ్యత్యాసాలు కావు. ఈ సమస్యలను సుప్రీం కోర్టే స్వయంగా ప్రస్తావించిందని గుర్తు చేసుకోవాలి. ఓటర్ల జాబితాల్లోంచి పేర్లను తొలగించడానికి వాటిని సాకుగా ఉపయోగించడంపై తన అసమ్మతిని వ్యక్తం చేసింది కూడా. ఈ అసంబద్ధ కారణాలను ఎన్నికల కమిషన్‌కు ఎత్తిచూపడానికి తన వాదనలు వినిపించగా వాటిని ఎన్నికల కమిషన్ తిరస్కరించిందని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు.
ఇక చేసేది లేక ఆమె నేరుగా సుప్రీం కోర్టు ముందు హాజరై తన వాదనలను వినిపించారు. దీనికి సుప్రీం కోర్టు స్వాగతించింది. ఈ గజిబిజి వ్యవహారంలో మరింత సున్నితంగా వ్యవహరించాలని ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు సూచించింది. మమతా బెనర్జీ వాదించిన అంశాలు ఒక సమస్యకు ప్రాధాన్యం ఇవ్వాలని మనల్ని అడుగుతున్నాయి. వి మనదేశం ప్రజాస్వామ్యయుతంగా పనిచేయడానికి కీలకమైన అంశాలు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 ప్రకారం ఏ వ్యక్తి తన జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదు. చట్టం ద్వారా నిర్దేశించిన ప్రక్రియ ద్వారా తప్ప మరెప్పుడూ అలా జరగకూడదు. ప్రతి పౌరుడికీ గౌరవంగా జీవించే ప్రాథమిక హక్కు ఉంటుంది. అదే విధంగా సర్వసత్తాక గణతంత్ర దేశంలో ప్రతి పౌరునికీ ఓటు వేసే ప్రాథమిక హక్కు ఉంటుంది. కాబట్టి దానిని జీవించే హక్కుతో సమానంగా పరిగణించాలి. ఓటరు జాబితా నుంచి ఎవరిని తొలగించినా చట్ట నిబంధనల ప్రకారం మొదట సరైన విధానాన్ని అవలంబించాలి. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటర్లు ఎవరినైనా అనర్హులని ప్రకటిచడం వెనుక పోల్ ప్యానెల్‌లో పనిచేసే అధికారుల ఇష్టాయిష్టాలు, అభిరుచులు మాత్రమే బలీయమైన కారణం కాకూడదు. భారతీయులు ప్రతివారూ ఓటు వేయాలి.
ఎందుకంటే అది వారి ప్రాథమిక హక్కు. అంతే తప్ప ఎన్నికల కమిషన్ దయాభిక్ష కాదు. ఈ హక్కు ఒక సౌకర్యవంతమైన దృశ్యం కాదని వాదించడానికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. బీహార్ తరువాత గత నవంబర్ 4 నుంచి 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను చేపట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా ఇది సాగుతోంది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఈ రెండో దశలో కూడా అనేక లోపాలు కనిపిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదు. ఓటర్ల జాబితా తయారీ అన్నది సమ్మిళిత ప్రక్రియగా ఉండాలి తప్ప ఓటర్లను మినహాయించేలా ఉండకూడదని సుప్రీం కోర్టు అనేక సార్లు సూచించినా ఆ సూచనలను సరిగ్గా పాటించడం లేదు. బీహార్‌లో చాలా ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తమ హక్కును కోల్పోయే రిస్కును తెచ్చిపెట్టిందని విపక్షాలు, వివిధ వర్గాల ప్రజలు తీవ్రంగా ఆందోళన వెలిబుచ్చారు. బీహార్‌లో సాధారణ నివాసులను తొలగించలేదని, వలసవాదులను మాత్రమే టార్గెట్‌గా పెట్టుకున్నామని ఎన్నికల కమిషన్ నమ్మబలికింది. అయినా ఎక్కువ శాతం మహిళలే జాబితాల్లోంచి తొలగించబడ్డారు. ఈ క్రమ రాహిత్యాలు ఎన్నికల కమిషన్ విధానపరమైన చట్రంలో రూపొందినట్టు కనిపిస్తోంది. పశ్చిమబెంగాల్‌లో కూడా ఇదే కొనసాగడం ఆందోళన కలిగించే విషయం.