Reading Time: < 1 minute

అమరావతి: ప్రేమించానని వెంటపడ్డాడు, దంపతులు మధ్యగొడవలు సృష్టించి వారిని విడగొట్టాడు. వివాహిత మరో యువకుడితో మాట్లాడుతుందని ఆమె నోట్లో ప్రేమోన్మాది బలవంతంగా పురుగులు మందు పోసి చంపేయడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పమిడి ముక్కల మండలం ఓ గ్రామానికి చెందిన ఓ యువతి తన భర్తతో కలిసి జీవిస్తోంది. భవానీ శంకర ప్రేమించానంటూ ఆ వివాహిత వెంటపడ్డాడు. భర్తతో విడాకులు తీసుకొని తనతో ఉండాలని ఆమెను వేధించాడు. భర్తకు ఫోన్ చేసి భార్య గురించి చెడుగా చెప్పడంతో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. దీంతో భర్తను వదిలేసి యువతి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. విజయవాడలో నర్సింగ్ కోర్సులో చేరేందుకు శిక్షణ తీసుకుంటుంది. భవాని శంకర్ ఆమె వెంటపడడంతో తల్లిదండులు అతడి దూరంగా హైదరాబాద్‌లో ఉంచి ఆమెను చదివిస్తున్నారు. యువతి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫోన్ నంబర్ తెలుసుకొని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకుంటానని సదరు యువతిని నమ్మించి విజయవాడకు రప్పించాడు. దేవీనగర్‌లోని ఓ గదికి యువతిని తీసుకెళ్లాడు. ఆమె ఫోన్‌ను చెక్ చేయగా మహేష్ అనే యువకుడితో మాట్లాడుతున్నట్టు తేలింది. వెంటనే యువతిని అడగడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. భవానీ శంకర్ పురుగుల మందు యువతి నోట్లో బలవంతంగా పోశాడు. ఆమె అపస్మారకస్థితికి చేరుకోవడంతో వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్పించి యువతి తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. యువతి ఆస్పత్రికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.