Reading Time: < 1 minute

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘నాగబంధం’ ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 15న మహా శివరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. దీనికి ముందు ఈ ఇతిహాస కథనంలోని మరో కీలక పాత్ర ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ ‘ఫైటర్’లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న రిషబ్ సాహ్నీ నాగబంధంలో ఆఫ్ఘన్ సుల్తాన్ అబ్దాలి పాత్రను పోషించాడు. 1750 బ్యాక్‌డ్రాప్‌లోని ఈ చిత్రంలో భారత్‌లో అబ్దాలీ చేసిన దండయాత్రలు, దేవాలయాల దోపిడీ, అపార సంపద కోసం అతడు చేసిన క్రూర ప్రయత్నాలను చూపించబోతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ పవర్ ఫుల్ గా వుంది. మంచుతో కప్పబడిన యుద్ధభూమిలో తుఫాన్ వాతావరణం మధ్య, భారీ రక్తంతో మచ్చలుపడ్డ గొడ్డలిని చేతబట్టి యుద్ధానికి దూసుకెళ్తున్న అబ్దాలీగా రిషభ్ కనిపిస్తారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తుండగా, జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్. అవినాష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ‘నాగబంధం’ చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకుంది.