Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో అధిక మొత్తంలో నిధులు కేటాయించినట్లు కేంద్ర వినియోగదారుల, ఆహార, ప్రజాపంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్ట్రానికి నిధులు కేటాయించలేదంటూ విపక్షాలు గగ్గో లు పెడుతున్నాయని, అయితే మీ జేబులు నింపుకోవడానికి కాదు ప్రజావసరాలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కేటాయిస్తామని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ జాఫర్, పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వి సుభాష్, ఇతర నాయకులు వెంకట్‌రెడ్డి, డాక్టర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ తెలంగాణకు బడ్జెట్‌లో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. అయినా తెలంగాణకు ఏమిచ్చారంటూ విపక్షాలు నేతలు ప్రశ్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఏయిర్ లైన్స్‌తో పోటీ పడే విధంగా దేశంలో ఏడు హై-స్పీడ్ రైళ్ళు రాబోతున్నాయని, అందులో హైదరాబాద్ నుంచి చెన్నై, పుణే, బెంగళూరుకు హై-స్పీడ్ రైళ్ళకు కేంద్రం అనుమతించడాన్ని గమనించాలని అన్నారు. ఆర్థికాభివృద్ధిలో దేశం ప్రస్తుతం నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి రాబోతున్నదని ఆయన తెలిపారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో మన దేశంలో ఆరు సార్లు రెట్టింపు అయ్యిందన్నారు. రానున్న రోజుల్లో మన దేశం మెడికల్ హబ్‌గా ఎదుగుతుందని ఆయన తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు మెగా సిటీలుగా అభివృద్ధి చెందేందుకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. అయినా బడ్జెట్‌లో ఏముందని విపక్షాలు ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుగోవడానికి వీలుగా ఎరువులపై ధరలు ఏ మాత్రం పెంచలేదని ఆయన వివరించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల గురించి ప్రశ్నించగా, మహాత్మా గాంధీ అంటే అందరికీ గౌరవం ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో అనేక విమానాశ్రయాలకు, అనేక పథకాలకు నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లే పెట్టారని, మహాత్మా గాంధీ పేరు చాలా తక్కువగా పెట్టారని ఆయన విమర్శించారు. మహాత్మా గాంధీ కూడా శ్రీ రామునికి పరమ భక్తుడని ఆయన చెప్పారు. 2047 వికసిత్ భారత్ లక్షంగా ప్రధాని నరేంద్ర మోడీ అనేక కార్యక్రమాలు చేపట్టారని అని ఆయన తెలిపారు. తాము దేశం కోసం పని చేస్తామని ప్రధాని మోడీ గురువారం స్పష్టంగా చెప్పారని ఆయన వివరించారు.

వ్యాపారవేత్తలతో కేంద్ర మంత్రి భేటీ

ఇదిలాఉండగా కేంద్ర మంత్రి ప్రహ్వాద్ జోషి పార్టీ కార్యాలయంలో కొంత మంది వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయించిన నిధుల గురించి వివరించారు. ఆర్థికంగా దేశం పురోగమిస్తున్నదని, అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని ఆయన వివరించారు.