
మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: నేను ఏం పాపం చేసిన.. నన్ను ఎం దుకు గోస పోసుకుంటున్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ పెద్దలను ప్రశ్ని స్తూ ఓటర్ల ఎదుట జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బల్దియా ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జగిత్యాల పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ టికెట్ దక్కని అభ్యర్థులకు మద్దతుగా జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. జగిత్యాలలోఎన్నికలు చిత్రంగా మారాయని ,ఎవరు ఏ పార్టీ అ నేది తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇక్కడ ఒకాయన నేను కారు మనిషినే అని చెప్పుకుంటూనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల టిక్కెట్లు ఎత్తుకెళ్లారని అన్నారు. అభివృద్ధి అంటే ఏమిటి.. అభివృద్ధి అంటే పక్కింటికి కన్నం వేయడమా మీరే చెప్పాలంటూ ఓటర్లను అభ్యర్థించారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జీవన్ రెడ్డికి తోడు నిలవడమే నేరమా…?జీవితంలో కాంగ్రెస్ కు ఓటు వేయని వారికి టిక్కెట్లు ఇస్తే నేను కార్యకర్తల పక్షాన నిలిచి పో రాటం చేయాలా.. వద్దా మీరే చెప్పాలంటూ కోరారు.నన్ను నమ్ముకున్నోళ్ల కు అన్యాయం జరుగుతుంటే వారికి అండగా నిల్వలా వద్దా చెప్పండి.. రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడుస్తున్న.. ఇక మీ దయ అంటూ అవేదన వ్యక్తం చేశారు.అభివృద్ధి రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కు అని,పార్టీలు మారితే అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు.రాజ్యంగా నాకు ఇచ్చిన పౌర హక్కులలో భాగంగా ఆనాడు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బోర్నపల్లి వంతెన కోసం రూ.70 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు.
ఆనాడు కెసిఆర్ నిధులు మంజూరు చేశారని, నేను వారి పక్కన చేరలేదన్నారు.2014 లో అందరి ఆశీర్వాదం తో ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో మార్పు కోరుతూ టీ ఆర్ ఎస్ అరాచకాలను ఎదిరిస్తూ ఒంటరి పోరాటం చేశానని అన్నారు. పదేళ్లు సోయి లేకుండా. పదేళ్లు అధికారంలో ఉండికూడా పదేళ్లు యావర్ రోడ్డు ఎందుకు విస్తరించలేదు.. ఇది మీ వైఫల్యం కాదా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.ఇప్పుడు కొత్తగా యావర్ రోడ్డు విస్తరించాలని ఎమ్మెల్యే సీఎంకు వినతి పత్రం ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ చెట్టు నీడన ఉన్న.. నా మీద ఉన్న కోపాన్ని నన్ను నమ్ముకునోళ్లను మీద తీసుకున్నారని ఆవేదన చెందారు. నన్ను నమ్ముకున్న వారి కోసం కోట్లాడుతానన్నారు. ప్రజలారా ఫిరాయింపుదారులను ఓటు అనే ఆయుధంతో కొట్టాలని పిలుపునిచ్చారు.ఫిరాయింపుదారులు పదేళ్లు కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తల తినే కాడి పళ్ళెం ఎత్తుకెళ్లారని, అయినా నిజమైన కాంగ్రెస్ మేమేనని చెప్పుకొచ్చారు.ఎన్ని ఆటంకాలు సృష్టించినా నిలబడి కోట్లాడుతానని,నేను బలపరిచిన వారిని గెలిపించి నాకు అండగా నిలవాలని ఓటర్లను కోరారు. మిమ్మల్ని నమ్ముకున్నా అన్యాయం చేయొద్దంటూ గద్గద స్వరంతో జీవన్ మాట్లాడగా, మీరు అధైర్యపడవద్దు.. మీకు మేము అండగా ఉంటామంటూ పలువురు మహిళలు కంట తడి పెట్టుకోగా జీవన్ చెమ్మగిల్లిన కళ్ళతో చలించిపోయారు.