Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: నగరాన్ని ప్రపంచ స్థాయి మహానగరంగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభు త్వ ప్రధాన లక్ష్యమని, ప్రజా ప్రభుత్వం కేవలం రెండు సంవత్సరాల్లోనే హైదరాబాద్ అభివృద్ధికి రూ.20,000 కోట్లు కేటాయించిందని డిప్యూటీ సి ఎం భట్టి విక్రమార్క తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.1,950.52 కోట్లు, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బి పరిధిలో రూ.12,500 కోట్లు, హెచ్‌ఎండిఏ పరిధిలో రూ.4,365 కోట్లు కేటాయించినట్లు ఆ యన వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ హై టెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లోని హాల్ 4లో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. 8వ తేదీ వరకు సు మారు మూడురోజుల పాటు ఈ షో జరుగనుంది. ఈ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ షోలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ సిఎం భట్టి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎస్ రామకృష్ణారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ స్థాయి లో నగరాభివృద్ధికి నిధులు కేటాయించడం ఇదే మొదటిసారి అని  ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా సమగ్ర ప్రణాళిక, ఒకే విధమైన పౌర సేవలు, ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలో సమతుల్య అభివృద్ధి సాధ్యమైందన్నారు.

రూ. 7,032 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు

హెచ్-సిటి ప్రోగ్రాం ద్వారా రూ. 7,032 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేశామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 కింద క్యూర్, ప్యూర్, రేర్ వ్యూహాంతో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీని కేంద్రంగా అభివృద్ధి సాగుతోందన్నారు. వరద భద్రత, వాతావరణ అనుకూలత కోసం సమగ్ర స్టార్మ్ వాటర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఉమ్టా ద్వారా సమగ్ర స్పేషియల్, బ్లూ-గ్రీన్, మొబిలిటీ మాస్టర్ ప్లాన్లను రూపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు. అభివృద్ధి కేవలం మౌలిక సదుపాయాలకే పరిమితం కాదని, ప్రజలపై నమ్మకం, సామాజిక న్యాయం, రాజకీయ స్థిరత్వం కూడా అవసరమని డిప్యూటీ సిఎం స్పష్టం చేశారు. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన, పెట్టుబడులకు అనుకూలమైన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని, మున్సిపల్ ఎన్నికల బిజీ ఉన్నప్పటికీ ఈ సమావేశానికి హాజరుకావడం ద్వారా ప్రభుత్వానికి ఈ రంగంపై ఉన్న ప్రాధాన్యత స్పష్టమవుతుందని ఆయన తెలిపారు. స్మార్ట్, స్థిరమైన, సమగ్ర అభివృద్ధితో ప్రపంచ స్థాయి హైదరాబాద్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

రియల్ ఎస్టేట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

రియల్‌ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందించడంతో పాటు నిర్మాణరంగదారులకు అనువైన పద్ధతిలో చేయూత నందిస్తుందని ఆయన తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తుందన్నారు. అందుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను సరళీకృతం చేయడంతో పాటు నీటిపారుదల శాఖ అనుమతుల్లో జాప్యాన్ని సత్వరమే పరిష్కరిస్తామని ఆయన అన్నారు. విస్తరిస్తున్న మహానగరానికి అనుగుణంగా తరలివస్తున్న పెట్టుబడులతో హైదరాబాద్ భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ నగరాల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌తో తన కుటుంబానికి ముడి పడి ఉన్న అనుబంధాన్ని, అనుభూతులను ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీలలో తన తండ్రికి వ్యవసాయ భూములు ఉండేవని ఆయన గుర్తు చేసుకున్నారు.

300కి పైగా రెరా -ఆమోదం పొందిన ప్రాజెక్టుల ప్రదర్శన

ఈ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్. జైదీప్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి జాతీయ స్థాయిలో పేరు వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ వృద్ధికి బలమైన పునాదిని సృష్టించిందన్నారు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ బి. జగన్నాథ్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ నిర్ణయాత్మకంగా వైవిధ్యమైన ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందిందన్నారు. సాంకేతిక కేంద్రంగా దాని గుర్తింపును దాటి ఆవిష్కరణ, జీవనశైలి, దీర్ఘకాలిక మూలధన పెట్టుబడికి గమ్యస్థానంగా మారిందన్నారు. క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ క్రాంతి కిరణ్ రెడ్డి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైన సవాళ్లను, ముఖ్యంగా తప్పుదారి పట్టించే ధరలు, కొనుగోలుదారులను మోసం చేసే చట్టవిరుద్ధమైన ప్రీ లాంచ్ అమ్మకాలను అరికట్టడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు (ఐఏఎస్), ప్రాపర్టీ షో కన్వీనర్ సుశీల్ కుమార్ జైన్, కో -కన్వీనర్ ఎన్. వేణుగోపాల్, ఇతర మేనేజింగ్ కమిటీ సభ్యులు, సందర్శకులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో 300లకి పైగా రెరా -ఆమోదం పొందిన ప్రాజెక్టులను ప్రత్యేకంగా ప్రదర్శించారు.