Reading Time: 2 minutes

అండర్19 వన్డే ప్రపంచకప్‌లో భారత యువ జట్టు అదరగొట్టింది. శుక్రవారం హరారే వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి తన ఖాతాలో ఆరో ప్రపంచకప్ ట్రోఫీని జత చేసుకుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక సెంచరీతో కదం తొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకే కుప్పకూలింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ టీమ్‌కు ఓపెనర్ బెన్ డాకిన్స్ శుభారంభం అందించాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న బెన్ స్కోరును పరిగెత్తించాడు. మరో ఓపెనర్ జోసెఫ్ 4 ఫోర్లతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. చెలరేగి ఆడిన బెన్ 56 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 66 పరుగులు చేశాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన బెన్ మెయిస్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించాడు. చెలరేగి ఆడిన మెయిస్ 28 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ థామ్ 18 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 31 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రాల్ఫి అల్బర్ట్ (0), ఫర్హాన్ అహ్మద్ (1), సెబాస్టియన్ మోర్గాన్ (0) విఫలమయ్యారు. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన కలెబ్ ఫాల్కనర్ విధ్వంసక శతకం సాధించాడు. భారత బౌలర్లను హడలెత్తించిన ఫాల్కనర్ 67 బంతుల్లోనే 9 ఫోర్లు, ఏడు భారీ సిక్సర్లతో 115 పరుగులు చేసి ఔటయ్యాడు. జేమ్స్ (28) అతనికి అండగా నిలిచాడు. మిగతా వారు విఫలం కావడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. టీమిండియా బౌలర్లలో అంబ్రిష్ మూడు, దీపేశ్, కనిష్క్ చౌహాన్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

వైభవ్ సునామీ..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అండగా నిలిచాడు. ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగిన వైభవ్ వరుస ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి పోయాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రె అతనికి సహకారం అందించాడు. ఆకాశమే హద్దుగా బ్యాటింగ్ చేసిన వైభవ్ ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అతన్ని కట్టడి చేసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దూకుడుగా ఆడిన వైభవ్ 55 బంతుల్లోనే 8 ఫోర్లు, ఆరు సిక్సర్లతో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మరింత చెలరేగి పోయాడు. మరో 75 పరుగులను 25 బంతుల్లోనే అందుకున్నాడు.

దీన్ని బట్టి వైభవ్ విధ్వంసం ఏ రీతిలో సాగిందో ఊహించు కోవచ్చు. చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ 80 బంతుల్లోనే 15 ఫోర్లు, మరో 15 సిక్సర్లతో 175 పరుగులు చేశాడు. కెప్టెన్ మాత్రె (53), వేదాంత్ త్రివేది (32), విహాన్ మల్హోత్రా (30), అభిజ్ఞాన్ కుందు (40)లు కూడా మెరుపులు మెరిపించడంతో భారత్ స్కోరు 411 పరుగులకు చేరింది. వైభవ్ సూర్యవంశీ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్ అవార్డును సొతం చేసుకున్నాడు. కాగా, భారత్‌కు అండర్19 వరల్డ్‌కప్‌లో ఇది ఆరో ట్రోఫీ కావడం విశేషం.