Reading Time: < 1 minute

శబరిమల బంగారం చోరీ, సంబంధిత మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తు ముమ్మరం అయ్యింది. శుక్రవారం ఈ కేసులో ప్రముఖ నటుడు జయరామ్‌కు ఇడి సమన్లు పంపించింది. విచారణకు రావాలని తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టిని కూడా ఇడి వర్గాలు విచారిస్తాయి. ఆలయ ద్వారం బంగారు తాపడం మాయం ఉదంతం కేరళలో సంచలనానికి దారితీసింది. పొట్టి ఈ కేసుకు సంబంధించే జైలులో ఉన్నారు. కొల్లాం న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో విడుదల అయ్యాడు. మొత్తం వ్యవహారంపై కేరళ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు కూడా కొనసాగుతోంది. తాము సమన్లు వెలువరించడంతో మలయాళ నటుడు జయరామ్ వచ్చే కొద్దిరోజుల్లోనే తమ ముందుకు విచారణకు వస్తారని ఇడి వర్గాలు తెలిపాయి. ఆలయ బంగారం మాయం ఉదంతంలో ఇడి ఇప్పటికే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టిడిబి) మాజీ కార్యనిర్వాహక అధికారి మురారీ బాబును, ఉద్యోగి ఎస్ శ్రీకుమార్‌ను విచారించింది. శ్రీ కుమార్ పాత్ర కీలకం కావడంతో ఆయన తిరిగి విచారణకు రావాలని ఇడి ఆదేశించింది.