Reading Time: < 1 minute

గడ్చిరోలి ః మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. దీనితో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య మూడుకు చేరింది. పరస్పర కాల్పుల్లో అంతకు ముందు తీవ్రంగా గాయపడ్డ పోలీసు అధికారి ఒకరు చికిత్స దశలో ఆసుపత్రిలో చనిపోయాడు. మూడు రోజుల క్రితం ఆపరేషన్ ఆరంభమైంది. ఇప్పటివరకూ మొత్తం ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. గడ్చిరోలి నారాయణ్‌పూర్ ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని ఫోడేవాడ గ్రామం వద్ద ఎన్‌కౌంటర్ తీవ్రస్థాయిలో సాగుతోంది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కేడర్ ఉందని సమాచారం అందడంతో ఏరివేతకు జవాన్ల బృందం ఇక్కడికి వచ్చింది. గడ్చిరోలి, గోండా జిల్లాల్లో నక్సలైట్ల ఏరివేతకు మహారాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక సి 60 పోరాట దళం ఇక్కడ రంగంలోకి దిగింది. ఈ ప్రాంతంలోకి పెద్ద ఎత్తున మరిన్ని దళాలను తరలించి, పూర్తి స్థాయిలో మావోయిస్టుల నిర్మూలనకు దిగాలని సంకల్పించారు. ఇప్పటి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నక్సలైట్లు ఎవరనేది గుర్తించలేదు. ఇక చనిపోయిన పోలీసుజవానును దీపక్ చిన్నా మాధవిగా గుర్తించారు. గాయపడ్డ మరో జవాను జోగా మాధవిని కూడా ఇసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం నుంచి ఈ జవాను బయటపడ్డారని అధికారులు తెలిపారు.