Reading Time: < 1 minute

అమరావతి: భూ సమస్యల ఫిర్యాదులు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయని ఎపి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో మీ భూమిపై కన్నేయకుండా సర్వ హక్కులు కల్పించామని అన్నారు. ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో సిఎం పర్యటించారు. సభా ప్రాంగణంలోని స్టాళ్లను పరిశీలించారు. కలుగొట్లలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ప్రసంగించారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని, ఇప్పుడు ఇచ్చిన పాస్ పుస్తకాలను ఎవరూ ట్యాంపర్ చేయలేరని తెలియజేశారు. క్యూఆర్ కోడ్ వల్ల మీ ఫోన్ లోనే మీరు చూసుకోవచ్చు అని మీ భూమిని ఎవరి పేరుతోనైనా మారిస్తే వెంటనే తెలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

మీ రికార్డులన్నీ కంప్యూటర్ లో భద్రంగా ఉంటాయని, ట్యాంపర్ చేస్తే నేరుగా జైలుకే వెళ్తారని.. వదిలి పెట్టేది లేదని, అవసరమైతే పిడి యాక్టు పెట్టి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. మీ రికార్డులన్నీ మీ అనుమతితోనే మార్పు చేస్తామని, సర్వే చేసేటప్పుడు మీ సమక్షంలోనే అన్నీ జరుగుతాయని అన్నారు. సర్వే తర్వాత పుస్తకం ముద్రించి మీకు చూపించాకే కొత్త పుస్తకం లభిస్తుందని, చిన్న అక్షర దోషం లేకుండా పుస్తకం ముద్రణ జరుగుతుందని చెప్పారు. ఒక్క పైసా అవినీతి లేకుండా పట్టాదార్ పాస్ పుస్తకం ఇస్తామని, లంచాల వ్యవస్థకు స్వస్తి చెప్పాలనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. 9500 గ్రామాల్లో సర్వే చేయాలి.. 62 లక్షల మందికి కొత్తగా ఇచ్చే అవకాశం ఉంటుందని, భూ వివాదాలు లేని రాష్ట్రంగా మార్చే బాధ్యత తీసుకున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.