
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి దూరదృష్టి, ఎటువంటి విజన్ లేదని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. తనతో పాటు ఓ వర్గంపైన ద్వేషం పెంచుకుంటుందన్నారు. ఎన్నికలలో వరుసగా ఓటమి ఎదురుకావడంతో జీర్ణించుకోలేని ప్రతిపక్షాలను, తనను, ఎన్డీఏ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నాయని ప్రధా ని నరేంద్ర మోడీ గురువారం నాడు రాజ్యసభలో విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని ప్రసంగించారు. లోక్ సభలో ప్రధాని ప్రసంగం లేకుండానే ఆ తీర్మానం ఆమోదించా రు. లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీలు సభాకార్యక్రమాలకు పదేపదే అంతరాయం కల్గించడం పట్ల ఆయన విచారం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలు తమ ప్రవర్తనతో రాష్ట్రపతి పదవిని అలంకరించిన పేద గిరిజన మహిళను అవమానించడమే కాక, రాష్ట్రపతి పదవిని, భారత రాజ్యాంగాన్ని కూడా అవమానించాయని ప్రధాని విమర్శించారు. యుపిఎ హయాంలో భారత్ 11వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే ఎన్‌డిఎ హయాంలో 3వ స్థానానికి చేరుకుందని ప్రధాని ప్రకటించారు. ప్రపంచంలో భారత్ పరపతి పెరుగుతోందని, గతంలో మనతో ఒప్పందం చేసుకోవడానికి పలు దేశాలు ముందుకొచ్చేవి కావని.. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు మనతో ఒప్పందం చేసుకుంటున్నాయని అన్నారు. ప్రధాని తన ప్రసంగంలో ప్రతిపక్షాలను పేరుపేరునా ప్రస్తావించి. వారి తప్పిదాలను దుమ్మెత్తి పోశారు.
కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టును రాహుల్ గాంధీ దేశద్రోహి అని దూషించడాన్ని మోడీ ఖండించారు. ఇది మొత్తం సిక్కు సమాజాన్ని అవమానించడమే అని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రస్తావిస్తూ, అక్రమ వలసదారులను రక్షించడానికి తృణమూల్ కోర్టుకు వెళ్తున్నదని ఆయన అన్నారు. పశ్చిమ బెంగా ల్‌లో యువత ఉద్యోగాలు, హక్కులు, గిరిజనుల భూములను ఈ చొరబాటు దారులు గుంజుకుంటున్నారని, వారిని మమత రక్షిస్తున్నారని ప్రధాని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కు అధికారం తప్ప, ప్రజల సంక్షేమం, శాంతి భద్రతలు పట్టవని విమర్శించారు. ఒకప్పుడు మొహోబత్ కి దుకాన్ అన్న నోటితోనే కాంగ్రెస్ మోడీ నీ సమాధి తవ్వుతాం అని నినదిస్తున్నారని, ఇది ఎన్నికలలో ఓటమి వల్ల వారి నిరాశ నిసృ్పహలకు అద్దం పడుతోందని విమర్శించారు. 2002 నుంచి అంటే దాదాపు 23 ఏళ్లుగా తాను గుజరాత్ లో ఉన్నా, పార్లమెంటులో లేకున్నా, కాంగ్రెస్ తనను విమర్శించని రోజు లేదన్నారు. ఓ పేదవ్యక్తి ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పదవులు చేపట్టడం కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతున్నదని ఆయన విమర్శించారు. 140కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో దేశాన్ని ప్రగతి పథంలో నడుపుతున్న తనకు సమాధి తవ్వడం కాంగ్రెస్ కు కానీ, ఇతర పార్టీలకు కానీ సాధ్యంకాదన్నారు. ప్రధాని పదవి తన కుటుంబం ఆస్తిగా భావించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని దుమ్మెత్తి పోశారు.
సంస్కరణ ఎక్స్‌ప్రెస్‌లో భారత్
భారతదేశం ఇప్పుడు సంస్కరణ ఎక్స్‌ప్రెస్‌లో ఉందని, 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన భారతంగా తీర్చి దిద్దడమే తమ లక్ష్యం అని ప్రధాని ప్రకటించారు. యురోపియన్ యూనియన్, అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందాలను ప్రస్తావిస్తూ, ఈ ఒప్పందాలవల్ల దేశం వికసిత్ భారత్ గా ఆవిర్భవిస్తుందన్నారు. రాజ్యసభలో దాదాపు 100 నిముషాల పాటు ప్రసంగించిన ప్రధాని 11 ఏళ్లుగా తన ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. తక్కువ ద్రవ్యోల్బణం, వేగవంతమైన ఆర్థిక వృద్ధి కారణంతో భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు దూసుకు పోతోందని వివరించారు.ప్రపంచ సమస్యల పరిష్కారంలో భారతదేశం కీలక పాత్ర వహిస్తున్న విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్ అయినా, టిఎంసి అయినా, డిఎంకే అయినా, వామపక్షాలు అయినా దశాబ్దాలుగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాయి.ఆస్తులు కూడగట్టుకున్నాయి తప్ప, పౌరుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి గట్టి కృషి చేయలేదని ప్రధాని విమర్శించారు.
లోక్ సభలో పరిణామాల పట్ల ఆవేదన
లోక్ సభలో ప్రజాస్వామ్య దేవాలయం. లోక్ సభలో జరిగిన పరిణామాల పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసోం కు చెందిన ఎంపి స్పీకర్ స్థానంలో ఉంటే ఆయనపై కాగితాలు విసిరారు. అవి ఈశాన్య భారతాన్ని అవమానించడం కాదా, ఆంధ్రప్రదేశ్ కు చెందిన టిడిపి ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ దళిత కుమారుడు చైర్ లో ఉండగా ఆయనను అవమానించడం ఏమాత్రం సమంజసం అని ప్రతిపక్షాలను నిలదీశారు. అసోంకు చెందిన గాయకుడు, చిత్రనిర్మాత, కవి భూపేన్ హజారికాను కూడా కాంగ్రెస్ అవమానించిందని ఆయన ఆరోపించారు. ఆయనకు తాము భారతరత్న ఇచ్చి గౌరవిస్తే, దానిపైన కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిందని ఆయన విమర్శించారు.
ఎంపి సదానందన్ మాస్టర్ కు ప్రశంసలు
నామినేటెడ్ సభ్యుడు ఎంపి సి.సదానందన్ మాస్టర్ కృత్రిమ కాళ్ల పై నిలిచి సభలో చేసిన ప్రసంగాన్ని గుర్తుచేస్తూ, ఆయన స్పూర్తిని ప్రధాని మెచ్చుకున్నారు. యువకుడిగా ఉన్నప్పుడే, రెండు కాళ్లు నరికివేయబడినా, చెక్కుచెదరని ధీమాతో దేశ సేవకు అంకితం కావడాన్ని ఆయన ప్రశంసించారు.