Reading Time: 2 minutes

భారతదేశ చరిత్రలో రాజులెందరో పుట్టారు. కానీ ప్రజల కోసం రాజ్యాన్ని ఒక సాధనంగా మార్చుకున్నవారు చాలా అరుదు. అలాంటి అరుదైన మహానేతల్లో మొదటి వ్యక్తి సాహూ మహారాజ్, ఆ తర్వాత సాహుజీ రావ్ గైక్వాడ్ అగ్రస్థానంలో నిలుస్తారు. సాహుజీ రావ్ బరోడా (మహారాజా సయాజీరావ్ గైక్వాడ్ III) సంస్థానాన్ని పాలించాడు. అతడు అణగారిన వర్గాల ఆశాకిరణం, సామాజిక విప్లవానికి దారి చూపిన దిక్సూచి. విద్యనే ఆయుధంగా మార్చిన దూరదృష్టి గల పాలకుడు. ఆ కాలంలో సమాజం కులగోడలతో నలిగిపోతున్నప్పుడు, విద్య కొద్దిమందికే పరిమితమైనప్పుడు, విద్య హక్కు.. అది దానం కాదు! అని ధైర్యంగా ప్రకటించాడు.ఆయన రాజ్యమే విద్యా రాజధానిగా మారింది. 1906లోనే ప్రాథమిక విద్యను ఉచితంగా, తప్పనిసరిగా అమలు చేసిన రాజ్యం బరోడా. ఇది బ్రిటిష్ భారతదేశంలోనే అత్యంత విప్లవాత్మక నిర్ణయం.

నేడు రాజ్యాంగంద్వారా అమలవుతున్న విద్య హక్కు చట్టాన్ని ఆనాడే కార్యరూపం దాల్చిందంటే, సాహుజీ రావ్ గైక్వాడ్ దళితులు, వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు, స్కాలర్‌షిప్‌లు, విదేశీ విద్యకు ఆర్థిక సహాయం అందించి సామాజిక న్యాయ పాలన దిశగా అడుగులు వేశాడు. మహిళల విద్య, వితంతు వివాహాలు వంటి సామాజిక సంస్కరణలకు మద్దతు పలికాడు. అణగారిన వర్గాలకు విద్యలో రిజర్వేషన్లు అమలు చేసిన తొలి పాలకుల్లో ఆయన ఒకరు. అందుకే ఆయన్ని సామాజిక న్యాయానికి తొలిశిల్పి అంటారు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకు ఆర్థిక సహాయం అందించిన రాజు. ఈ సందర్భంగా దేశంలో వెనుకబడిన వర్గాలకు, దళితులకు మధ్య చారిత్రక అనుబంధం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. సాహు మహారాజ్, సాహుజీ రావ్ గైక్వాడ వంటి వెనుకబడిన వర్గాల రాజుల ప్రోద్బలంతోనే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బయటకు వచ్చాడు.

జ్యోతిరావ్ ఫూలేను అంబేద్కర్ గురువుగా ప్రకటించుకొని సామాజిక ఉద్యమాలు చేశాడు. ఆ మహనీయుల స్ఫూర్తితో బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలలో బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు కలిసి రాజ్యాధికారంలోకి వచ్చారు. కావున నేడు బహుజనుల చారిత్రక అనుబంధం అవసరం. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం బిసి, ఎస్‌సి,ఎస్‌టిల విముక్తి కోసం డాక్టర్ విశారదన్ మహారాజు ఉద్యమిస్తున్నాడు. ఉమ్మడి పోరాటంతోనే బహుజనుల సంక్షేమం. సాహుజీ రావ్ గైక్వాడ్ జీవితం మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. రాజ్యం అంటే భోగం కాదు.. బాధ్యత. పాలన అంటే అధికారం కాదు.. సేవ అని చెప్పిన గొప్పరాజు. ఆ మహానేత ఫిబ్రవరి 6న తుది శ్వాస విడిచాడు. నేడు ప్రజాస్వామ్య దేశంలో దళిత బహుజనులు రాజ్యాంగ హక్కులకు దూరంగా ఉన్నారు. జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయాలు అవకాశాలు అందడం లేదు. ప్రజల సంక్షేమం నుంచి ప్రభుత్వం తప్పుకుంటుంది. సామాజిక ఆర్థిక అంతరాలు పెచ్చురిల్లుతున్నాయి.

ప్రవేటీకరణతో ప్రభుత్వ విద్య, ఆరోగ్య వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. విద్యా సంస్థల్లో కుల వివక్ష విజృంభిస్తున్నది. ఇది హాస్టళ్లలో, తరగతుల్లోకి వెళ్లింది. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ బడుగుల రిజర్వేషన్ వ్యవస్థకు గండికొడుతున్నారు. వీటన్నిటికీ దళిత, బహుజన విద్యార్థులే బలవుతున్నారు. ఈ నేపథ్యంలో సాహుజీ రావ్ గైక్వాడ్ సామాజిక సంస్కరణలు, రాజ్యాంగ ఆదేశాలు అత్యవసరం. ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం నిలబడితే ఛత్రపతి సాహు మహారాజ్ మనలో కనిపిస్తాడు. విద్య కోసం పోరాడితే సాహుజీ రావ్ గైక్వాడ్ మనలో జీవిస్తాడు. వీరి ఇరువురి ప్రోత్సాహం, మద్దతుతోనే దేశ రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ ఆవిర్భవించాడు. బిసి, ఎస్‌సి, ఎస్‌టిల ఉమ్మడిగా ఉద్యమించి రాజ్యాధికారం వైపు ప్రయాణించాలి. అప్పుడే రాజ్యాంగం కోరుకున్న సంక్షేమ రాజ్యానికి పునాది పడుతుంది. ఇదే సాహుజీ రావ్ గైక్వాడ్‌కు ఇచ్చే ఘనమైన నివాళి.

సంపతి రమేష్ మహారాజ్, 7989579428