
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సభ్యులు ప్రధాని స్థానాన్ని చుట్టుముట్టి ఏదైనా ఊహించని చర్యకు పాల్పడే ప్రమాదం ఉందని తనకు కచ్ఛితమైన సమాచారం తెలియడంతో నరేంద్రమోడీని సభకు రావద్దని తాను కోరినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం నాడు తెలిపారు. ఏదైనా అవాంఛనీయ సం ఘటన జరిగితే, దేశ ప్రజాస్వామ్యం సంప్రదాయాలకు తీరని అపచారం జరిగి ఉండేదని సభ మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష సభ్యులు బుధవారం నాడు తన కార్యాలయంలో చాలా హేయంగా ప్రవర్తించారని పే ర్కొంటూ, ఆ సంఘటన ఓ మచ్చ లాంటిదన్నారని స్పీకర్ వివరించారు. బుధవారం సభలో కొంతమంది సభ్యుల ప్రవర్తన చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా ఉందని తెలియజేయడానికి చింతిస్తున్నామని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. బుధవారంనాడు లోక్ సభలో నాటకీయ పరిణామాలుచోటు చేసుకున్నాయి. ప్రధాని ప్రసంగానికి ముందు కొందరు మహిళా ప్రతిపక్షఎంపీలు బ్యానర్లు పట్టుకుని ప్రధాని స్థానం వైపు దూసుకురావడంతో సభలో ఆందోళన మొదలైంది.
దీంతో సభ బుధవారం నాడు వాయిదా పడింది. ఆ సమయంలో మోడీ సభలో లేరు. బీజేపీ సభ్యుడు రిరి చౌదరి రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై వ్యాఖ్యలు చేస్తుండగా ప్రతిపక్ష సభ్యులు సభలో స్పీకర్ వేదిక వద్దకు దూసుకువచ్చారు. రాజ్యాంగం స్పీకర్ పీఠంను గౌరవస్థానంలో నిలిపిందని ఆయన అన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్నవారు రాజకీయ విభేదాలను సభలో చర్చించలేదన్నారు. స్పీకర్ కార్యాలయంలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన బొత్తిగా సముచితంగా లేదని ఓం బిర్లా అన్నారు. రాష్ట్రప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు ప్రధాని సమాధానమిచ్చే సమయంలో ఆయన పై అవాంఛనీయ ఘటన జరిగే అవకాశం ఉందని తనకు పక్కా సమాచారం ఉండడంతో తానే ప్రధానిని సభకు రావద్దని కోరానని స్పీకర్ చెప్పారు. సభ గౌరవాన్ని పరిరక్షించడం తన బాధ్యత అన్నారు. తన విజ్ఞప్తిని మన్నించి సభకు రానందుకు ప్రధాని మోదీకి స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు నిర్విరామంగా నినాదాలు చేస్తుండగా స్పీకర్ సభను వాయిదా వేశారు.