Reading Time: < 1 minute

ప్రయాగ్‌రాజ్ (యుపి): 1982లో మొదలైన ఒక హత్యకేసు ఏకంగా 42 ఏళ్లపాటు కొనసాగి నిందితుడికి 100 ఏళ్ల వయసు వచ్చాక ముగిసింది. తన జీవితంలో సగానికి పైగా కాలాన్ని ‘నిందితుడు’ అనే ముద్రతో గడిపిన ఆ వృద్ధుడిని అలహాబాద్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ లోని హమీర్‌పూర్ జిల్లాలో 1982లో భూవివాదం ఒకరి హత్యకు దారి తీసింది. ఈ హత్యలో మైకు ప్రధాన నిందితుడు కాగా, ధనీరామ్, సత్తిదిన్ హత్యకు ప్రేరేపించారని అభియోగాలు నమోదయ్యాయి. హమీర్‌పుర్ సెషన్స్ కోర్టు 1984లో ధనీరామ్, సత్తిదిన్‌కు జీవితఖైదు విధించింది. మైకు మాత్రం అరెస్టు కాలేదు. సెషన్స్ కోర్టు తీర్పుపై ఆ ఇద్దరు 40 ఏళ్ల క్రితం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.

అప్పటి నుంచి ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉండిపోయింది. అది విచారణ దశలో ఉండడంతో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. ఈ కేసు పెండింగ్‌లో ఉండగానే సహ నిందితుడు సత్తిదీన్ మృతి చెందాడు. ప్రధాన నిందితుడు మైకు పరారీలో ఉన్నాడు. చివరికి ఈ కేసులో ధనిరామ్ మాత్రం ఏకైక అప్పీలుదారుగా మిగిలిపోయాడు. ఈ మధ్యకాలంలో ధనిరామ్ ఎన్నో సామాజిక ఇబ్బందులను, మానసిక ఆందోళనలను అనుభవించాడు. ప్రధాన నిందితుడు మైకును అరెస్టు చేయకపోవడాన్ని కోర్టు ప్రస్తావించింది. దనిరామ్ అప్పీలుపై నిర్ణయంలో అసాధారణ జాప్యం, ప్రాసిక్యూషన్‌లో లోపాలను ఎత్తి చూపుతూ న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. అతడి వయసును పరిగణన లోకి తీసుకుని నిర్దోషిగా తేల్చింది.