
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’పై ఏర్పాటు చేసిన స్వతంత్ర శాస్త్రీయ ప్యానెల్‌కు సభ్యునిగా ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ బాలరామన్ రవీంద్రన్ నియమితులయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల నుంచి ఎంపిక చేసిన 40 మంది నిపుణులతో ఈ ప్యానెల్ ఏర్పాటైంది. ఇందులో భారత్ తరఫున రవీంద్రన్ ఉన్నారు.
ఎఐ సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలు అంచనా వేయడం, ఎఐ విధానాలపై ఐక్యరాజ్యసమితికి సలహాలు అందించడం ఈ ప్యానెల్ బాధ్యత. బాలరామన్ ఐఐటీ మద్రాస్ లోని వాధ్వానీ స్కూల్ ఆఫ్ డేటాసైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు అధిపతిగా వ్యవహరిస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ నుంచి పిహెచ్‌డి పొందారు. బెంగళూరు లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి మాస్టర్ డిగ్రీ పొందారు.