
హైదరాబాద్: మాజీ సిఎం లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని కెసిఆర్ కిట్ ఎందుకు మాయమైంది? అని చేపపిల్లలు ఎందుకు మాయమైపోయాయని? పెన్షన్ ఏమైందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆరే తెలంగాణ జాతిపిత అని కొనియాడారు. హామీల అమలుపై అడిగితే కాంగ్రెస్ నుంచి సమాధానం లేదు? అని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు నల్లా నీళ్లు కూడా సరఫరా చేయడంలేదని, తులం బంగారం లేదని, కల్యాణ లక్ష్మి లేదని మండిపడ్డారు. సిఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ పోయినా, అంతరిక్షం పోయినా కుక్కతోక వంకరేనని ఎద్దేవా చేశారు. రైతు బంధు ఇవ్వలేదు కాబట్టి రైతులంతా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని, రూ.4 వేలు పింఛను ఇవ్వలేదు కాబట్టి అవ్వా, తాతలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని సూచించారు. కెసిఆర్ చేతుల్లో తెలంగాణ పదిలంగా ఉండేదని, కెసిఆర్ పాలనలో రోజు రోజుకు భూములు పెరిగాయని తెలియజేశారు. రాష్ట్రంలో ఇప్పుడు భూములు కొనేవాడే లేడని, ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు కాంగ్రెస్సోళ్లు నోట్ల కట్టలు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2 వేలకు ఓటు అమ్ముకుని ఇబ్బంది పడతారా? అని తెలంగాణకు బిజెపి ఏమైనా చేసిందా? అని హరీష్ రావు నిలదీశారు.