
హైదరాబాద్: ఏనుగులు గుంపు దాడి చేయడంతో ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏనుగుల గుంపు బడ్కీపున్నూ గ్రామంపై దాడి చేసింది. గ్రామ ప్రజలు భయంతో పరుగులు తీశారు. గణేశ్, భగియాదేవి దంపతులు నివసిస్తున్న ఇంటిపై రెండు ఏనుగులు దాడి చేసి గొడలను ధ్వంసం చేశాయి. దంపతులు తన బంధువు కమ్లి దేవితో కలిసి పరుగులు తీశారు. వారికి ఎదురుగా ఏనుగులు గుంపు వారిపై దాడి చేసి కాళ్లతో కిరాతకంగా ముగ్గురిని చంపేశాయి. కర్మీ దేవి అనే మహిళ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బొకారో డివిజనల్ అటవీ శాఖ అధికారి సందీప్ షిండే తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆహారం కోసం వెతుక్కుంటూ గ్రామంపై దాడి చేశాయని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. మృతులకు నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఏనుగుల గుంపు అక్కడే సంచరిస్తుండడంతో చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాత్రివేళలో రైతులు, స్థానికులు బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు.