
తిరువనంతపురం: పుచ్చకాయల లోడ్‌తో వెళ్తున్న వ్యాన్‌ని తనిఖీ చేయగా పేలుడు పదార్థాలు కనిపించడంతో పోలీసులు కంగుతిన్నారు. ఈ సంఘటన కేరళ రాష్ట్రం పాలక్కాడ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాలక్కాడ్ టౌన్ సౌత్ పోలీసులు బుధవారం అర్థరాత్రి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పుచ్చకాయల లోడ్‌తో వెళ్తున్న వ్యాన్‌ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. పైభాగంలో ఉన్న పుచ్చకాయలను తొలగించగా పేలుడు పదార్థాలు కనిపించాయి. ఒక్కసారిగా పోలీసులు షాక్ కు గురయ్యారు. సదరు వ్యాన్ నుంచి 18000 జిలెటిన్ స్టిక్స్, 4800 డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వంద బాక్స్ లలో పేలుడు పదార్థాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం వ్యాన్ డ్రైవర్ సెంథిల్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులోని ధరమ్ పూర్ ప్రాంతం తిరుప్పుర్ నుంచి కేరళలోని తిరుసూరు జిల్లాకు సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పేలుడు పదార్థాలను ఎందుకు తీసుకొచ్చారు.. ఎక్కడికి సరఫరా చేస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి పదార్థాలు ఎక్కువగా అక్రమ క్వారీయింగ్, బావుల తవ్వకాల కోసం ఉపయోగిస్తారు. వ్యాన్ డ్రైవర్ సెల్‌ఫోన్ ను స్వాధీనం చేసుకొని కాల్ హిస్టరీ పరిశీలించడంతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.