Reading Time: 3 minutes

‘అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు.. నట్టేట్లో ముంచేసాడే గంగరాజు’ అన్నట్లు ఉంది తెలుగు రాష్ట్రాల పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026- 27 కేంద్ర బడ్జెట్‌లో రెండు రాష్ట్రాలకు కేటాయింపులు లేకుండా నిట్టనిలువునా ముంచారు. తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రూ. 45.48 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌లో కీలక రంగాల్లో తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయింపులు లేకపోవడం అన్యాయం. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, జిహెచ్‌ఎంసి పరిధిలో అభివృద్ధి పనులు, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కేంద్ర సహకారం లభించలేదు. రూ. 10,000 కోట్ల బయోఫార్మా శక్తి పథకంలో, జీనోమ్ వ్యాలీ వంటి బలమైన బయోఫార్మా వ్యవస్థ, టీకా తయారీలో తెలంగాణ కీలక పాత్ర ఉన్నప్పటికీ రాష్ట్రానికి అవకాశం కల్పించలేదు. అలాగే ఎలక్ట్రానిక్ భాగాల తయారీ, కెమికల్ పార్కులు, స్పోర్ట్ గూడ్స్ తయారీ, ఆరెంజ్ ఎకానమీ, మెడికల్ వాల్యూ హబ్స్, అంతర్గత జలమార్గాలు, సెమీకండక్టర్ అభివృద్ధి వంటి రంగాల్లో కూడా తెలంగాణను పక్కన పెట్టారు.

సింగరేణి బొగ్గు ప్రాంతంలో అరుదైన ఖనిజాల ఆనవాళ్లు ఉన్నప్పటికీ, వాటి అన్వేషణ ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి చోటు కల్పించలేదు. అభివృద్ధి కార్యక్రమాల కోసం 4% ఆర్థిక లోటు అనుమతి ఇవ్వాలని తెలంగాణ విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించగా, తెలంగాణకు మాత్రం 4.3% లోటు కొనసాగించాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ, రాజకీయాలకు అతీతంగా తెలంగాణకు చెందిన ఎంపిలు అందరూ కలిసి ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. కేంద్ర బడ్జెట్ 2026 -27లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేవు. విశాఖ ఎకనామిక్ జోన్‌కు రూ. 5,000 కోట్లు కోరినా బడ్జెట్‌లో చూపించలేదు. పోలవరంకు క్రితం బడ్జెట్ మరణ శాసనం రాసినట్లు దాన్ని 135 కి బడ్జెట్‌లో డెడ్ స్టోరేజీకి పరిమితం చేస్తే కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిని పెట్టిన దాన్ని తిరిగి సవరించుకోలేదు. 150 అడుగుల ఎత్తున పూర్తిస్థాయిలో నీరు నిలబెట్టి, (960 ఎండబ్లు దాదాపుగా పూర్తయిన పవర్ ప్రాజెక్టు నడవాలంటే అవసరం), పునరావాసం పూర్తి ప్యాకేజీ కి ఇంకా ఇవ్వాల్సిన దాదాపు రూ. 37 వేల కోట్లలో ఒక్క రూపాయి ఈ బడ్జెట్‌లో పెట్టలేదు. అమరావతి పునర్నిర్మాణం ఇతర కొన్ని నగరాల అభివృద్ధి పథకంలో భాగమే -రూ. 1,128.91 కోట్లు. (ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్ కోసం రూ. 432.09 కోట్లు. పట్టణ తాగునీరు, మురుగు నీటి వ్యవస్థలకు రూ. 800 కోట్లు. రోడ్లు, వంతెనలు అభివృద్ధికి రూ. 350 కోట్లు.

గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ. 500.99 కోట్లు. ప్రకృతి వ్యవసాయానికి రూ. 155.32 కోట్లు సెవరేజ్ వర్క్‌కు). ప్రత్యేక గ్రాంట్‌తో కాకుండా అమరావతి అప్పులతో కట్టుకోవాలి. బిజెపి అధ్యక్షుడు, ఎంపిలు ఇంతకుముందు కొండబద్దలు కొట్టినట్టు చెప్పిన మాటలు సంవత్సరానికి రూ. 15,000 కోట్లు. నాలుగు సంవత్సరాలు అది కూడా పూర్తి సహాయం (గ్రాంట్) హామీ గాల్లోకి ఎత్తేసారు. గట్టిగా మాట్లాడే ఒక్క రాజకీయ నాయకుడు కూడా కనపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరీ దౌర్భాగ్యంగా ఉంది. పులికాట్ సరస్సు వద్ద బర్డ్- వాచ్ ట్రైల్స్ అభివృద్ధికి కేటాయింపులు లేవు. 15 లక్షల మంది యువకులు పారిశ్రామిక అధిపతులుగా మారటానికి రావలసిన ఇన్సెంటివ్స్ విభజన హామీల్లో చాలా గుజరాత్‌కు ఎత్తుకుపోయిన గద్దలు బర్డ్ వాచింగ్ చేయమంటున్నారు.

అదానీకి పారిశ్రామిక లాభాలు

డేటా సెంటర్ టాక్స్ హాలిడే (2047 వరకూ) అదానీకి కట్టబెట్టారు. (విశాఖ/ అనకాపల్లి రూ. 22,002 కోట్ల ప్రాజెక్ట్)కు డైరెక్ట్ లాభం 15% సేఫ్- హార్బర్ రేట్ ద్వారా రైడెన్ ఇన్ఫోటెక్ కు చేకూరనుంది. గంగవరం పోర్ట్, సాగర్ మాలా ఎక్స్‌పాన్షన్‌లో ఉత్తర తీర పోర్టులకు ప్రాధాన్యత. రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులకు ప్రత్యేక ఉపయోగం కల్పించారు. నక్కపల్లి పోర్టు గుజరాతి వ్యాపారి మిట్టల్ (మెటల్స్) ఎలక్ట్రో లైజర్ మాన్యుఫాక్చరింగ్ ఇన్సెంటివ్స్ రేవు అనుబంధంగా స్టీల్ మెటల్ ఎగుమతులకు లాభం చేకూర్చే విధంగా ప్రణాళిక రూపొందించారు. రేర్ ఎర్త్ మినరల్స్ (4 రాష్ట్రాలకు రూ. 8,200 కోట్లు) ఆంధ్రలో అదానీ గ్రూప్ (శ్రీకాకుళం) బీచ్ సాండ్ మినరల్స్ (గార్నెట్, మోనాజైట్) మైనింగ్ అదానీ & స్పైస్ ఇన్ఫ్రా జెవి ద్వారా కార్యకలాపాలు. ఇంతకుముందు తెలుగువారి చేతిలో ఉండేది ఇప్పుడు ఆపేశారు. ఇంకా చాలామంది గుజరాతీ వ్యాపారుల మయం అయితే ఆంధ్రలో ఉన్న యువత సెక్యూరిటీ గార్డు డ్రెస్సులు వేసుకుని వారి కంపెనీలకు కాపలాదారులుగా ఉన్నారు.

రైల్వేబడ్జెట్: ఆంధ్రప్రదేశ్ ప్రసక్తి లేదు. అయితే ముంబైనుంచి హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు వేసే హై స్పీడ్ రైల్వే నెట్‌వర్క్‌లో ఆంధ్రప్రదేశ్ కూడా మధ్యలో ఉంది కాబట్టి ఉంది. బుల్లెట్ ట్రైన్: ముంబై- అహ్మదాబాద్, ఢిల్లీ- వారణాసి, చెన్నై- మైసూరు మాత్రమే ప్రస్తావన. క్రితం సారి తెలంగాణకి ఒక కోటి రూపాయలు మాత్రం రైల్వేబడ్జెట్‌లో పెంచి వాళ్ళ రెండు రాష్ట్రాలకి రూ. 15 వేల కోట్ల రూపాయలు పైగా పెంచారు. ఆ రెండు రాష్ట్రాలకి 61 వేల కోట్ల రూపాయల పైన కేటాయించారు. విశాఖ, హైదరాబాద్ విజయవాడ ప్రాజెక్టుల ప్రత్యేక మెన్షన్ లేదు. తెలంగాణకు ఒక జాతీయ జల ప్రాజెక్టు గత 12 ఏళ్లలో కేటాయించలేదు. ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ యువత పారిశ్రామిక మార్పుకు పెద్ద ఉపయోగం లేదు. స్పెషల్ స్టేటస్, ఇండస్ట్రియల్ ప్యాకేజీలు లేవు. అదానీ, మెటల్స్ వంటి పెద్ద కార్పొరేట్లకు మాత్రమే పరోక్ష ఇన్సెంటివ్స్. 

ముచ్చుకోట సురేష్ బాబు

99899 88912