
మన తెలంగాణ/ఉమ్మడి నల్లగొండ బ్యూరో: పదేళ్ళు అక్రమంగా సంపాదించారు.. మొగుడుపెండ్లాం మాట్లాడిన మాటలు విన్నడు.. సినీతారల ఫోన్లు ట్యాపింగ్ చేసినోడు అసలు మనిషేనా? అన్నం తినెటోడు ఎవడైనా భార్యాభర్తల ఫోన్లు వింటడా? కేసిఆర్ ఎవడికి జాతిపిత? తెలంగాణ సమాజం నవ్వుతోంది.. అని మాజీసీఎం కేసిఆర్‌పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రాంతంలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయినా లెక్కచేయకుండా తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధి.. ఆమె తెలంగాణ తల్లి.. తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేసిన ఫ్రొపెసర్ జయశంకర్ తెలంగాణ జాతిపిత అని కొనియాడారు. ఫోన్లు ట్యాపింగ్‌లో నోటీసులు ఇస్తే వణికిపోయిన బిఆర్‌ఎస్ నేతలు కేసిఆర్ జాతిపిత అంటూ కలరింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మీఫాంహూజ్ తెలంగాణ సమాజానికి రాసిస్తావా? నీఆస్తులు ప్రజలకు ఇస్తావా? అంటూ కేసిఆర్‌పై మండిపడ్డారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ(గూడూరు)లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాపాలన బహిరంగసభ బుధవారం జరిగింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంఖుస్థాపన చేయడంతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలకు సీఎం చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల ప్రచారసభకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న ఏడు కార్పోరేషన్‌లు, 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఆలోచించి ఓటువేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. మున్సిపల్ శాఖ నాదగ్గరే ఉంది.. మరో 8ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం.. కార్పోరేషన్‌లు, మున్సిపాలిటీలు అభివృద్ధి చేసి చూపిస్తాం.. అని సీఎం చెప్పారు.
మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుభరోసా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. తెలంగాణలోని రైతులందరికీ 9వేలకోట్ల రూపాయలు ఇస్తామన్నారు. నల్లగొండ జిల్లా ప్రజలపై కేసిఆర్‌కు కోపం.. అక్కసు ఉందని, కడుపులో విషం పెట్టుకొని ఎస్‌ఎల్‌బిసిని పక్కన పెట్టాడని విమర్శించారు. అనుకొని ప్రమాదం జరిగి ఇంజనీర్లు, కార్మికులు చనిపోతే మామ, అల్లుడు, కొడుకు పండుగ చేసుకొని విషం చిమ్మారని అన్నారు. ఎస్‌ఎల్‌బిసిని పూర్తిచేసి తీరుతామని సీఎం భరోసా ఇచ్చారు. నమ్మి టిక్కెట్ ఇస్తే నక్కజిత్తుల భాస్కర్‌రావు జానారెడ్డిని మోసం చేశాడని, కష్టపడి గెలిపిస్తే పార్టీని వీడి జానారెడ్డిని ఓడించారని గుర్తుచేశారు. మానాయకులను బెదిరిస్తున్నవంట.. ఎవరు బెదిరెటోడు లేడు.. ఒళ్ళు చింతపండు చేస్తాం.. జాగ్రత్త అని మిర్యాలగూడ మాజీఎమ్మెల్యే భాస్కర్‌రావును హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యంలోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలో 70వేల ఉద్యోగాలు ఇచ్చాం.. 4.50లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం.. 1000 బస్సులు కొనిచ్చి ఆడపడుచులను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం.. అమ్మగారింటికి వెళ్ళడం.. అమ్మవారి దర్శనానికి వెళ్ళేందుకు టిక్కెట్ లేకుండా చేశాం.. పేదలందరికీ సన్నబియ్యం ఇచ్చాం.. 200యూనిట్ల ఉచితకరెంట్ ఇచ్చి పేదలను ఆదుకున్నాం.. అని ముఖ్యమంత్రి చెప్పారు.
ఆసియా ఖండంలోనే ఎక్కువ పంటపండిస్తుంది.. మిల్లింగ్ చేస్తుంది మిర్యాలగూడ ప్రాంతం అని, ఆప్రాంతం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బిఆర్‌ఎస్ నేతలకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, వారి పదేళ్ళ పాలనలో కేవలం బిఆర్‌ఎస్ నేతలే దోచుకుతినలేదా? అని ప్రశ్నించారు. రాబోయే బడ్జెట్‌లో లక్షలాది ఇళ్ళకు నిధులు కేటాయించి తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు ఇందిరమ్మ ఇళ్లు పెంచి ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలంగాణ ఉన్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ కట్టినవేనని, అవన్నీ కళ్ళకు కనిపిస్తున్నాయని చెప్పారు. బిఆర్‌ఎస్ నేతలు మందిని ముంచి మస్తుగా సంపాదించుకున్నరు.. ఇప్పుడు ఏది ఇచ్చినా తీసుకోండి.. కాంగ్రెస్‌కు ఓటేయండి.. బిఆర్‌ఎస్ నేతలకు కర్రుకాల్చి వాత పెట్టాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వందకు వందశాతం కాంగ్రెస్ గెలవాలని, ఆదిశగా కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈబహిరంగ సభలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బిఎల్‌ఆర్, కుందూరు జయవీర్‌రెడ్డి, నేనావత్ బాలునాయక్, వేముల వీరేశం, నలమాద పద్మావతిరెడ్డి, మందుల శ్యామేల్, వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు కేతావత్ శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, గుత్తా అమిత్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి, వి.హనుమంతరావు, పున్న కైలాష్, గుడిపాటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.