
గడచిన రెండు దశాబ్దాలుగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా దక్షిణాదిన ‘విత్తన మేళా’లు, విత్తన పండుగలు, విత్తనోత్సవాలు జరుగుతున్నాయి. ఒకరకంగా ఇవి వ్యవసాయ ప్రదర్శనల వంటివే! ఇక్కడ విత్తనాలు, వ్యవసాయోత్పత్తుల మార్పిడే కాకుండా రైతుల మధ్య, రైతులు, రైతు సంఘాల మధ్య జ్ఞాన మార్పిడి కూడా చోటుచేసుకుంటోంది. రైతుల మధ్య సహకారం పెంపొందుతోంది. ప్రకృతి వ్యవసాయంలో మేలైన సాగు పద్ధతులు, ఉపయుక్త విధానాలను ఒకరి నుంచి మరొకరు నేర్చుకుంటున్నారు. ఒక ప్రాంతంలో విజయవంతమైన పద్ధతులు, విధానాలను మరో చోటుకు వ్యాప్తి చేయడంలో ఈ ఉత్సవాలు కీలక, నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయి. వ్యవసాయం విషయంలో, మనం తినే ఆహారం విషయంలో జరుగుతున్న కొన్ని ప్రత్యేక ప్రచారాలు మన పూర్వపు వ్యవసాయ పద్ధతుల వైపు ఆలోచనల్ని మళ్లిస్తున్నాయి. తృణధాన్యాల (మిల్లెట్స్)తో కూడిన సహజ ఆహారం ఆరోగ్యానికి ఎలా కారణమో వివరించే డాక్టర్ ఖాదర్‌వలీ వంటి వారి ప్రచారం దేశంలో లక్షలాది మందిని ప్రభావితం చేస్తోంది. అదే విధంగా సుభాష్ పాలేకర్ వంటి వ్యవసాయ రంగ నిపుణులు ప్రకృతి వ్యవసాయంపై చేస్తున్న ప్రచారం, దేశమంతా పర్యటిస్తూ ఆసక్తికలిగిన వారితో పంచుకుంటున్న అనుభవాలు పాత, సంప్రదాయిక విత్తనాలు, సాగు, ఇతర వ్యవసాయ పద్ధతులపై కొత్త విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి.
సహజ విత్తనాలెందుకు వెనుకబడ్డాయ్?
ఇరవై, ముఫ్ఫై ఏళ్ల కింది వరకు కూడా దాదాపు మన రైతులంతా తమ పంట నుంచే మేలైన విత్తనాలను ఎంపిక చేసుకునేవారు. వాటిని భద్రపరచుకునేది. అవి వాడి సాగు చేసుకునేది. తమ స్వీయ జ్ఞానంతో ఉత్తమ రకాలను ఎంపిక చేసి ‘పరస్పరం పంపిణి చేసుకుంటూ వ్యవసాయాన్ని రైతులే వృద్ధ్ది చేసేది. అవన్నీ సహజ పద్ధతులు. ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ఆవాసాల్లో ఈ పద్ధతి సాగుతోంది. అధిక దిగుబడి లక్ష్యంగా 1960 లలో నాటి ప్రభుత్వాలు ప్రోత్సహించిన ‘హరిత విప్లవం’ తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. సంకర (హైబ్రిడ్) విత్తనాలను, తదనంతర కాలంలో జన్యుమార్పిడి విత్తనాలను సబ్సిడీలతో ప్రోత్సహించడంతో రైతులు అటువైపు మళ్లారు. క్రమంగా తమ సంప్రదాయ విత్తనాలను, సదరు పరిజ్ఞానాన్ని విస్మరించారు. సంకర, జన్యుమార్పిడి విత్తనాలు వాటి స్వభావ రీత్యానే రసాయన ఎరువుల్ని, పంట ఆశించే చీడల నివారణకు పెస్టిసైడ్‌ల వాడకాన్ని డిమాండ్ చేస్తాయి. దాంతో వ్యవసాయంలోకి అసాధారణ స్థాయిలో విష రసాయనాలు వచ్చి చేరాయి. భూసారం నశించింది. మనం తినే ఆహార పదార్థాల్లో సూక్ష్మరూప రసాయనాలు (రెసిడియల్స్) మిగిలి మనిషి ఆరోగ్యం క్షీణించడంతో వ్యాధుల బాధ తీవ్రమైంది. కేన్సర్ వంటివి పెచ్చుమీరాయి. హరితవిప్లవానికి కేంద్రస్థానంగా ఉండిన పంజాబ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాలకు కేన్సర్ రోగులను తీసుకువెళ్లే ఒక రైలు (కేన్సర్ రైలుగా ప్రతీతి) ఇప్పటికీ నడుస్తోందంటే పరిస్థితి తీవ్రతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదొక పార్శ్వమైతే, సంకర విత్తనాలే పంటకు గ్యారెంటీ, ఎరువులు వాడితేనే పంట దిగుబడి పెరుగుతుంది, పెస్టిసైడ్స్ తోనే చీడల నుంచి విముక్తి, వీడి సైడ్స్‌తోనే కలుపు మొక్కల్ని నిర్మూలించగలం. ఇటువంటి ప్రచారం పెరిగింది. ఈ క్రమంలోనే వ్యవసాయంలోకి మార్కెట్ చొచ్చుకు వచ్చింది. విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్, వీడిసైడ్స్… ఇదొక మార్కెట్ మాయాజాలమై వ్యవసాయాన్ని కమ్మేసింది. ఫలితంగా సంప్రదాయ ప్రకృతి సాగు, దేశీ విత్తనాలు వెనక్కి వెళ్లాయి.
నిరూపితమవుతున్న నిజం
సహజసిద్ధమైన సంప్రదాయ విత్తనాలు మానవ ఆరోగ్యానికే కాకుండా పర్యావరణ సుస్థిరతకు కూడా ఎంతో ముఖ్యం. దేశీ విత్తనాలు సహజమైనవి కనుక వాతావరణ మార్పులను తట్టుకోగల శక్తితో ఉంటాయి. జీవవైవిధ్యానికి రక్ష! దేశీ విత్తనాల ద్వారా పండించే పంటల్లో పోషకాలు ఎక్కువ. తమిళనాడులో జరిగే విత్తనాల పండుగల్లో ఓ సంప్రదాయం ఉంది. అక్కడి ప్రదర్శనల్లో నచ్చిన విత్తనాలను తీసుకుపోయే రైతులు వాటికి బదులుగా సదరు రైతులకు మరుసటి సంవత్సరం అంతకు రెట్టింపు విత్తనాల్ని తెచ్చి ఇస్తారు. ఇరవై యేళ్లుగా ఇది జరుగుతున్నా ఏ విధమైన ఫిర్యాదులు లేవు. ఇలా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సానుకూల క్షేత్ర అనుభవాలున్నాయి. కర్నాటకలోని మైసూర్ ప్రాంతం కేంద్రంగా పనిచేసే ‘సహజ సమృద్ధ’ సంస్థ దేశీ విత్తనాలతో పలురకాల పంటలు పండించి దేశవ్యాప్త విస్తరణ, మార్కెట్‌పరంగా కూడా ఎన్నో విజయాలు సాధించింది. ఒడిశాలోని ‘సంభవ’ సంస్థ లవంగం గింజ, పనస గింజ, నల్ల బియ్యం, కత్తి గింజ వంటి అంతరించిపోతున్న పంటలను విజయవంతంగా పునరుద్ధరించగలిగింది. వారు పునరుద్ధరించిన అడవిలో వెయ్యి కంటే ఎక్కువ జాతుల మొక్కలున్నాయి.తక్కువ నీటిని వినియోగించే ‘సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన’ (ఎస్‌ఆర్‌ఐ), మన తెలుగు రాష్ట్రాల్లో ‘శ్రీవరి’ సాగుగా ప్రఖ్యాతి పొందిన రకంతో సహా సుమారు 500 రకాల వరిని సాగు చేస్తున్నారు. 700 దేశీయ వరి రకాలతో ‘విత్తన బ్యాంక్’ నడిపిస్తున్నారు.ఇందులో కొన్ని రకాలు.. తీవ్ర కరువు వరద వంటి కఠిన వాతావరణ విపరీత పరిస్థితుల్ని కూడా తట్టుకోగలుగుతాయి.
విత్తన స్వావలంబనే పరిష్కారం
విత్తన స్వావలంబన అవసరం. విత్తనమ్మీద రైతుకే అజమాయిషీ ఉండాలి. విత్తనాలపై కంపెనీలు పెత్తనం, కార్పొరేట్ల గుత్తాధిపత్యం మొత్తం వ్యవసాయాన్నే అస్థిరపరిచింది. పశ్చిమ కనుమల్లోని అట్టపాడి ప్రాంతంలో పలు గిరిజన తెగలున్నాయి. వారి జీవనోపాధి అడవి, ప్రకృతి వ్యవసాయం మీద ఆధారపడి ఉండేది. గిరిజన ఆహార సంస్కృతి వారి వారసత్వ వ్యవసాయానికి అనుగుణంగానే అభివద్ధి చెందింది. అందుబాటులో ఉన్న వనరులతోనే వ్యవసాయం సాగేది. సుదీర్ఘకాలం సుభిక్షంగా ఉన్నారు. మైదాన ప్రాంత వలసదారుల రాకతో గిరిజనుల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వాణిజ్య పంటల సాగు, రసాయన సమ్మేళనాలు… వంటి ఆధునికత చొరబడింది. స్థానిక వ్యవసాయ విద్య, పరిజ్ఞానం నశించి, కాలక్రమంలో జీవన పరిస్థితులే క్షీణించాయి. ఇదొక అనుభవమైతే, పశ్చిమబెంగాల్‌లోని పురులియా, బంకురా ప్రాంతాల్లోని సబార్ సమాజం విత్తనాల నిల్వలో పరిణామ ప్రగతి సాధించగలిగారు. అన్నీ స్వీయ అనుభవాలే, ప్రకృతి ఒడిలోనే! మొదట గాజు సీసాల్లో మొక్కజొన్న, పప్పుధాన్యాలు వంటి విత్తనాలను నిల్వచేస్తే వాటికి పురుగు పట్టింది. తర్వాత కీటకాలను దూరం ఉంచడానికి మట్టి పాత్రలు, ఆకు బుట్టలను ఉపయోగించే సంప్రదాయ నిల్వ పద్ధతులకు మారి విజయం సాధించారు. సంప్రదాయ విత్తన నిల్వలో రసాయనాల పాత్ర ఉండదు. ఆధునిక విత్తనాలకు పెస్టిసైడ్స్ పూత పూస్తారు. విత్తనం కూడా జీవపదార్థమే కనుక రసాయనాలకు దాని జీవనం ప్రభావితమవుతుంది. ఇటువంటి అన్ని విషయాల్లో సంప్రదాయ, ఉపయుక్త జ్ఞానం విత్తన పండుగలు, ఉత్సవాల్లో రైతులకు అందిస్తారు. వాతావరణ మార్పు విసిరే సవాళ్లకు కూడా సమాధానాలు, సంక్షోభ నివారణ మార్గాలు రైతాంగానికి ఇక్కడ లభిస్తాయి.
మన ముంగిట్లో విత్తన పండుగ
తెలంగాణ తొలి విత్తన పండుగ గత సంవత్సరం జరిగింది. రెండో వార్షిక విత్తన పండుగ ఈ ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో కౌన్సిల్ ఫర్ గ్రీన్‌రివల్యూషన్ సిజిఆర్, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో జరుగనుంది. శ్రీశైలం జాతీయ రహదారిపైనున్న కడ్తాల్ సమీపంలోని అన్మాస్‌పల్లి (ఎర్త్‌సెంటర్)లో జరిగే ఈ పండుగలో పదిహేను రాష్ట్రాలనుంచి రైతులు, రైతు ప్రతినిధులు, వివిధ రైతాంగ సంస్థలకు చెందిన వారు వస్తున్నారు. 70కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. విత్తనాలతో పాటు వైవిధ్యభరితమైన వ్యవసాయ ఉత్పత్తులు, సాంకేతికత, సంప్రదాయ జ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. రైతులతో పాటు వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాల బోధకులు, విధాన నిర్ణయాలు చేసే నాయకులు, అధికారులు కూడా ఈ మూడు రోజుల పండుగ ప్లీనరీ, అనుబంధ చర్చాగోష్ఠి, శిక్షణ సమావేశాల్లో పాల్గొంటున్నారు. అందరూ ఆహ్వానితులే!.
దిలీప్ రెడ్డి