
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తోందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు బడ్జెట్ లో కేంద్రం ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జి రామ్ జి పథకంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఉచితాల కోసమే బడ్జెట్ అన్నట్లుగా ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రూ.96 వేల కోట్లు జి రామ్ జి పథకానికి నిధులు పెంచారని తెలియజేశారు. ఎరువులపైనా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని ధ్వజమెత్తారు. ఎన్నికల బడ్జెట్ కాదు.. వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టిన బడ్జెట్ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆవాస్ కింద రాష్ట్రానికి 4.30 లక్షల ఇళ్లు కేటాయించారని, జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు పెద్దపీట వేశారని ప్రశంసించారు.
కొమురువెల్లి, జోగులాంబ రైల్వే స్టేషన్లను త్వరలోనే ప్రారంభం కానుందని, 5 వందేభారత్,2 అమృత్ భారత్ రైళ్లను తెలంగాణకు ఇచ్చిందని అన్నారు. 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు తెలంగాణకు రానున్నాయని, రూ.5.50 లక్షల కోట్లతో 3 హైస్పీడ్ రైల్ కారిడార్లకు ప్లాన్ వేశారని చెప్పారు. హైదరాబాద్- యాదగిరిగుట్ట మధ్య ఎంఎంటిఎస్ మూడో ఫేజ్ అని ఎంఎంటిఎస్ మూడో లైన్ కు ప్రధాని త్వరలో భూమిపూజ చేస్తారని, మేడారం జాతరకు కేంద్రం ప్రకటించిన నిధులు తెచ్చే బాద్యత తనది అని అన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ దగా వల్ల సింగరేణి భ్రష్టు పట్టిందని, సింగరేణిని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మాజీ సిఎం కెసిఆర్ మార్చుకున్నారని మండిపడ్డారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ కూడా కెసిఆర్ బాటలోనే వెళ్తోందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.