Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం అన్ని రంగాల్లో సాధిస్తున్న పురోగతి, ఆర్థిక వ్యవస్థ పనితీరు, పాలనలో పారదర్శకత, తమ ప్రభుత్వ పనితీరుకు కేంద్ర ఆర్థిక సర్వే నివేదికే నిదర్శనమని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఐటీ, పరిశ్రమలు, మహిళా సంక్షే మం, ఇలా ప్రతి రంగంలోనూ తెలంగాణ సత్తా చాటుతోందని కేంద్ర ఆర్థిక సర్వే గణాంకాలు నిరూపించాయని పేర్కొన్నారు. అన్నింటికీ మించి ద్రవ్యోల్భణం విషయంలో జాతీయ సగటుకన్నా తెలంగాణ తక్కువ నమో దు కావడం ప్రభుత్వ పాలనకు నిదర్శనమని అన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘ఎకానమిక్ సర్వే 2025–26’ అభివృద్ధిలో తెలంగాణ శరవేగంగా దూసుకెళుతుందనడానికి ఒక తిరుగులేని సాక్ష్యమని అన్నారు.

సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు శని వా రం మీడియాతో మాట్లాడుతూ 2023—24లో ద్రవ్యోల్బ ణం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, 2024–25 నుంచి తెలంగాణ మెరుగైన పనితీరును కనబరిచిందని వెల్లడించారు. 2024–25లో జాతీయ సగ టు 4.63 శాతం ఉంటే తెలంగాణలో 3.67 శాతంగా ఉందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ – డిసెంబర్ నాటికి) జాతీయ సగటు 1.72 శాతంగా ఉంటే తెలంగాణలో 0.20 శాతంగా ఉందని ఈ సర్వే తేల్చింది. తెలంగాణలో ద్రవ్యోల్బణం ఏ మేరకు తగ్గిందీ మంత్రి శ్రీధర్‌బాబు వివరిస్తూ 2022–23లో 8.61శాతం, 2023–24లో 6.36%, 2024–25లో 3.67, 2025–26లో 0.20%గా నమోదైందని చెప్పారు.

2019-2035 మధ్య 8.47 శాతం వార్షిక జీడీపీ వృద్ధి రేటు సాధిస్తుంది

8.47 శాతం వార్షిక జీడీపీ వృద్ధి రేటుతో 2019—-2035 మధ్య ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 4వ నగరంగా మన హైదరాబాద్ రికార్డు సృష్టించబోతోందని ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ తేల్చిందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఇంతటి భారీ వార్షిక వృద్ధి రేటు ప్రపంచంలో మరే ఇతర ప్రధాన నగరానికి లేదని, ఇది తమ ప్రభుత్వ ఆర్థిక విజయం కాదా? అని ప్రశ్నించారు. 2018లో 50.6 బిలియన్ డాలర్ల్లుగా ఉన్న హైదరాబాద్ జిడిపి, 2035 నాటికి 201.4 బిలియన్ డాలర్లకు చేరుకోబోతోందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా వేసిందని చెప్పారు. ఇంతటి వేగంతో దూసుకుపోతున్న హైదరాబాద్ ఆగం అవుతున్నట్లా..? లేక గ్లోబల్ పవర్ హౌస్‌గా ్గ మారుతున్నట్లా? తమ ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేసే వారే సమాధానం చెప్పాలని అన్నారు. రాష్ట్రం కేవలం కేంద్రం ఇచ్చే నిధుల మీదో, అప్పుల మీదో ఆధారపడటం లేదని, తన సొంత పన్ను వనరుల నుంచే అత్యధిక ఆదాయాన్ని గడించి,

ఆర్థికంగా మనం ఎంత బలంగా ఉన్నామో ఈ సర్వే ప్రపంచానికి చాటిచెప్పిందని పేర్కొన్నారు. ఇది తమ ప్రభుత్వ సమర్థతకు, పారదర్శకమైన ఆర్థిక నిర్వహణకు నిదర్శనమని చెప్పారు. ఐటీ, ఇన్నోవేషన్, ఏఐ రంగాల్లో తెలంగాణ ముద్రను చూసి ప్రపంచమే అబ్బురపడుతోందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కేవలం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కే పరిమితం కాకుండా, గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తెలంగాణ ఎదిగిందని కేంద్ర ఆర్థిక సర్వే తేల్చిందని గుర్తు చేశారు. దేశం మొత్తం మీద ఉత్పత్తి అవుతున్న సేవల రంగంలో కేవలం నాలుగు రాష్ట్రాలు 40 శాతం వాటాను కలిగి ఉంటే దానిలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల సరసన తెలంగాణ సగర్వంగా నిలబడిందని అన్నారు. జెన్-ఏఐ స్టార్టప్లలో దేశవ్యాప్తంగా 7 శాతం వాటాతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని హర్షం వ్యక్తం చేస్తూ బెంగళూరు, ఢిల్లీలతో పోటీపడుతూ హైదరాబాద్ స్టార్టప్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఈ సర్వే మరోసారి స్పష్టం చేసిందని అన్నారు.