Reading Time: 2 minutes

మన తెలంగాణ/వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అదే సంబురం.. అదే ఉద్వి గ్నం.. మేళ తాళాలు.. శివసత్తుల పూనకాల మధ్య జన దేవతలు శనివారం రాత్రి వన ప్రవేశం చేశారు. సమ్మక్క తల్లి అబ్బియో…సారక్క తల్లి అబ్బి యో.. మళ్లీ రెండేళ్లకొస్తాం తల్లీ.. సల్లంగ చూడు తల్లీ అంటూ భక్తులు భక్తిపారవశ్యంతో తల్లులను సాగనంపారు. ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా సాగి న తల్లుల వన ప్రవేశం కన్నుల పండువగా సాగింది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తర్వా త గద్దెలపై కొలువుదీరిన నలుగురిలో ఒక్కొక్కరూ తిరుగు పయనమయ్యారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతర ఈనెల 28వ తేదీనుంచి నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది. మేడారంలో గద్దెలపై కొలువుదీరిన పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగుండ్లకు, గోవిందరాజు ఏటూరునాగారం మండలం కొండాయికి భక్తుల జయజయ ద్వానాల మధ్య తిరుగు పయనమయ్యారు.

తొలుత ఇద్దరిని తరలించిన పూజారులు సమ్మక్క, సారలమ్మను వన ప్రవేశం చేసేందుకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సారలమ్మ గద్దె వద్ద కాక వంశీయులైన ఆదివాసీ పూజారులు తమ సంప్రదాయాలతో పూజా విధానాన్ని నిర్వహించారు. శనివారం రాత్రి 7.49 గంటలకు గద్దె నుంచి కన్నెపల్లికి సారలమ్మ తరలిస్తుండగా తీవ్ర ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకున్నది. భక్తులు పెద్దఎత్తున సారలమ్మను సాగనంపేందుకు ముందుకు కదిలారు. పోలీస్ రోప్ పార్టీలు పూజారులకు భద్రతగా ఉండి అమ్మవారిని జంపన్న వాగు మీదుగా తీసుకెళ్లారు. అదేవిధంగా సమ్మక్కను వనప్రవేశం చేసేందుకు ముందుగా ప్రధాన పూజారి కిష్టయ్యతో పాటు పూజారుల బృందం పూజలు జరిపారు. మేళ తాళాలు, సంప్రదాయ నృత్యాలతో కోలాహలం మధ్య అమ్మవారిని గద్దె నుంచి చిలుకలగుట్టకు తరలించారు. పెద్దఎత్తున వేచివున్న భక్తుల కేరింతలు, సంబరాల మధ్య వనప్రవేశం చేశారు. పోలీసుల పటిష్ట బందోబస్త్ నడుమ పూజారులు సమ్మక్క తల్లిని తీసుకెళ్లారు. గద్దెలపైకి తరలించే సమయంలో ఎలాంటి ఉద్విగ్న పరిస్థితి ఉందో దేవతల వన ప్రవేశం కూడా అంతే ఉద్విగ్నానికి తోడు కన్నుల పండువగా సాగింది. నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన జాతర దేవతల వన ప్రవేశంతో జాతర ముగిసింది.

తండోపతండాలుగా భక్త జనం

రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి తల్లులకు తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. తల్లులు గద్దెపై కొలువుదీరడంతో మొక్కుబడుల కోసం తరలివచ్చిన భక్తులతో మేడారం పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. గురువారం రాత్రి నుంచి తండోపతండాలుగా మొదలైన సమ్మక్క, సారలమ్మ దర్శనాలు శనివారం రాత్రి వన ప్రవేశం చేసే సమయం వరకు సాగాయి. శుక్రవారం భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో జాతరంతా కుంభమేళాను మించిపోయింది. నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన జాతరలో దేవతలు శనివారం రాత్రి వన ప్రవేశం చేశారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రాఫిక్ జామ్ తో భక్తుల అవస్థలు

ఈసారి జాతరలో కూడా ట్రాఫిక్ సమస్య భక్తులను వెన్నాడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు సరిపడా బస్సులు లేకపోవడంతో ఆర్టీసీ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శుక్రవారం దర్శనం పూర్తిచేసుకున్న భక్తులకు రాత్రి నుంచి సరిపడా బస్సులు లేకపోవడం, మరోవైపు ప్రయాణించే బస్సులు రోడ్లపై నిలిచిపోవడంతో అసహనానికి గురయ్యారు.

తుస్సుమన్న ఆధునిక టెక్నాలజీ

ఈసారి మేడారం జాతరలో ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని ఊదరగొట్టిన అధికారులు చివరకు చేతులెత్తేశారు. ఎఐ టెక్నాలజీతో ట్రాఫిక్ సమస్య రాకుండా చూస్తామని ప్రకటించినా అమలు సాధ్యం కాలేదు. జాతరలో అనుభవం లేని అధికారులు విధుల్లో ఉండడం కూడా సమస్యకు కారణభూతమైందని చెబుతున్నారు. హంగామా ఎక్కువ కావడం మినహా భక్తుల సౌకర్యాలను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోయాయి.

పోలీసుల తీరుపై పూజారుల ఆగ్రహం

జాతరలో పోలీసుల తీరుపై భక్తులే కాదు, పూజారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతరను తమ అధీనంలోకి తీసుకున్న తమ ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను తరలించే సమయంలో పూజారులు నిరసన వ్యక్తం చేశారు. గద్దెపై వాలంటీర్లు మోహరించి పూజారులను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొనడంతో పోలీసులు ఒక మెట్టు దిగారు. అయితే మిగతా జాతర పూర్తిగా పోలీసుల కనుసన్నలోనే నడవడంతో సాధారణ భక్తులు ఇబ్బంది పడ్డారు. సామాన్య భక్తులను వదిలేసిన పోలీసులు మాత్రం వీఐపీల సేవలో తరించారు.