Reading Time: 2 minutes

V S Babu.. తమిళనాడు సీఎం స్టాలిన్నే ఓడించిన.. విజయ్ పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు బ్యాగ్రౌండ్ ఇదే..!

Caption of Image.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి ఓడిపోయారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో స్టాలిన్ ఓటమి చవిచూశారు. దీంతో.. స్టాలిన్ ను ఓడించిన టీవీకే పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు ఎవరనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

వీ.ఎస్. బాబు టీవీకేలో కీలకంగా కొనసాగుతున్నారు. చెన్నైకి చెందిన సీనియర్ పొలిటీషియన్. అర్బన్లో ఆయనకు మంచి పట్టు ఉంది. ఆయన ప్రస్తుతం టీవీకేకు సంయుక్త ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వీఎస్ బాబు వయసు 75 సంవత్సరాలు. విజయ్ టీవీకే పార్టీ.. కొలత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి స్టాలిన్‌కు వ్యతిరేకంగా బాబును తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. టీవీకేలో చేరకముందు.. ఈ వీఎస్ బాబు ఏఐఏడీఎంకేలో ఉన్నారు.

అన్నాడీఎంకేలో ఆయన 2006 నుంచి 2011 వరకు చెన్నై కార్పొరేషన్‌లో కీలక పదవులతో సహా పలు కీలక పదవులను నిర్వహించారు. అంతేకాదు.. డీఎంకేలో కూడా ఆయన పనిచేశారు. ఉత్తర చెన్నై అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీఎంకే ఎమ్మెల్యేగా కూడా వీఎస్ బాబు పనిచేశారు. ఆయన చదువుకుంది 8వ తరగతి వరకూ మాత్రమే. వీఎస్ బాబు వెల్లడించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 3.7 కోట్లు. సీఎంను ఓడించి వీఎస్ బాబు చరిత్ర సృష్టించారు.

►ALSO READ | తమిళోళ్లకు ఇంకా సినిమా పిచ్చి పోలే: నార్త్ ఇండియన్స్ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో వార్..

డీఎంకే పార్టీ చరిత్రలోనే మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితిని చవిచూడలేదు. ఉత్తర చెన్నైలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కొలత్తూరు ఒకటి. ఈ నియోజకవర్గం అధికార డీఎంకేకు నిన్నమొన్నటి దాకా కంచుకోటగా ఉంది. డీఎంకే అధ్యక్షుడిగా కూడా ఉన్న స్టాలిన్, 2011 నుంచి ఈ సీటులో ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు.

2021 ఎన్నికల్లో..ఏఐఏడీఎంకే అభ్యర్థి ఆది రాజారామ్‌ను 70 వేల 384 ఓట్ల తేడాతో ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఈ కీలకమైన స్థానంలో ఓటింగ్ శాతం 2021లో 61.68 శాతం కాగా.. 2026లో 86.12 శాతానికి గణనీయంగా పెరిగింది. ఇంత ఓటింగ్ శాతం పెరిగినప్పుడే విజయ్ టీవీకే పార్టీకి ఈ నియోజకవర్గంలో సానుకూల పవనాలు వీచాయని ఈ ఫలితాలతో తేటతెల్లమైంది.

©️ VIL Media Pvt Ltd.