
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వైద్య విద్య, దంత విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్ యుజి 2026) పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. మే 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు నీట్ యుజి పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ప్రకటించింది. ఆదివారం(ఫిబ్రవరి 8) నుంచి మార్చి 9వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
ఎంబిబిఎస్, బిడిఎస్‌తోపాటు బిఎఎంఎస్,బియుఎంఎస్, బిఎస్‌ఎంఎస్ కోర్సులకు నీట్ (యుజి) పరీక్ష నిర్వహిస్తామని ఎన్‌టిఎ తెలిపింది. నీట్ (యుజి) ఫలితాల ఆధారంగా నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బిహెచ్‌ఎంఎస్ కోర్సు అడ్మిషన్లు నిర్వహిస్తారు. దీంతోపాటు ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ హాస్పిటల్‌లో మిలిటరీ నర్సింగ్ సర్వీస్(ఎంఎన్‌ఎస్)లో బిఎస్‌సి నర్సింగ్ కోర్సు అడ్మిషన్లకు నీట్ (యుజి)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. నాలుగేండ్ల బిఎస్‌సి నర్సింగ్ కోర్సుకు కూడా నీట్ (యుజి)లో అర్హత సాధించాల్సి ఉంటుందని ఎన్‌టిఎ తెలిపింది.
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ.1700 కాగా, జనరల్ ఇడబ్ల్యూఎస్/ఒబిసి ఎన్‌సిఎల్ అభ్యర్థులకు రూ.1600, ఎస్‌సి,ఎస్‌టి, వికలాంగులు,థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 3న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఏమైనా సందేహాలు ఉంటే 011- 40759000, 011 -69227700 ఫోన్ నంబర్లు లేదా neetug2026@nta.ac.inకు ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని ఎన్‌టిఎ తెలిపింది.
దేశంలోనే అతిపెద్ద పరీక్ష
దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షగా నీట్ పరీక్షకు పేరుంది. ఏటా సుమారు 20 నుంచి 23 లక్షల మందికిపైగా ఈ పరీక్షను రాస్తుంటారు. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లోని దాదాపు 1.08 లక్షల ఎంబిబిఎస్ సీట్ల భర్తీ కోసం ఏటా నీట్ యుజి పరీక్షను ఎన్‌టిఎ నిర్వహిస్తుంటుంది. మొత్తం 1.08 లక్షల ఎంబిబిఎస్ సీట్లలో దాదాపు 56 వేల సీట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉన్నాయి. నీట్‌లో సాధించే మార్కుల ఆధారంగా విద్యార్థులకు వివిధ కోర్సుల్లోనూ ప్రవేశాలు లభిస్తాయి.