
హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని మోసం చేశారని అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇందిరా చౌక్ దగ్గర కార్నర్ లో కెటిఆర్ మాట్లాడారు. రైతు భరోసాను సిఎం రేవంత్ రెడ్డి ఎగ్గొట్టారని, ఉద్యోగాల పేరుతో యువతను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. రేవంత్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదని, ఆరుగ్యారెంటీల పేర్లుతో ప్రజల్ని మోసం చేశారని కెటిఆర్ మండిపడ్డారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని రేవంత్ ప్రగాల్భాలు పలికారని, బతుకమ్మ చీర లేదు.. మాజీ సిఎం కెసిఆర్ కిట్ లేదని ధ్వజమెత్తారు.
తాండూరు ప్రజలకు బిఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి అండగా ఉంటారని, మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలియజేశారు. రేవంత్ కు నిజాయితీ ఉంటే నర్సింగ్ కాలేజ్ కు నిధులు విడుదల చెయ్ అని డిమాండ్ చేశారు. రైతు బంధు అడిగితే.. లాగులో తొండలు ఇడుస్తా అంటారని ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులు పెట్టిన భయపడమని, 420 హామీలు అమలు అయ్యే దాక ప్రశ్నిస్తునే ఉంటామని పేర్కొన్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చి అన్ని పథకాలను రద్దు చేశారని, చిన్న పరిశ్రమలపై కరెంట్ బిల్లు భారం మోపి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం ఎన్నికల్లో ప్రజలు మోసపోయారని, మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి మోసపోవద్దని కోరారు. రెండోసారి కూడా మోసపోతే మీదే తప్పవుతుందని కెటిఆర్ సూచించారు.