
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుంచి 25వ తేదీ వరకు జరుగనున్నాయి. శనివారం జూబ్లీహిల్స్‌లోని స్వామివారి ఆలయ ప్రాంగణంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పోస్టర్, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అంచనా వేస్తున్నామన్నారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణలు చేపట్టాలని కోరారు. చలువ పందిళ్లు, క్యూ లైన్లు, తాగునీరు, అన్న ప్రసాదాలు, పటిష్ట సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎస్వీ ఆలయ ఎల్.ఎ.సి ప్రెసిడెంట్ ఏవీ రెడ్డి, ఏఈవో రమేశ్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు నిరంజన్, హరికృష్ణ వీరితో పాటు పలువురు అధికారులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం : ఈ సందర్భంగా తెల్లవారుజామున స్వామివారిని మేల్కొలుపుతారు. అనంతరం ఆగమోక్తంగా తర్వాతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి 10.30 వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని, ఆలయ గోడలను, పైకప్పును, పూజాసామగ్రి తదితర వస్తువులు అన్నింటినీ నీటితో శుద్ధి చేస్తారు. తర్వాత సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 9 గంట వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహన సేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : ఈ నెల 17న ఉదయం ధ్వజారోహణం మేష లగ్నంలో ఉ. 10.30 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు. ఆరోజు రాత్రి పెద్దశేష వాహనంపై స్వామి దర్శనం ఇస్తారు. 18న ఇదే తరహాలో ఉదయం చిన్నశేష వాహనంపై స్వామిని ఊరేగిస్తారు. రాత్రి హంస వాహన సేవ నిర్వహిస్తారు. 19న ఉదయం స్వామివారు సింహ వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు. రాత్రికి ముత్యపుపందిరి వాహనంపై విహరిస్తారు. 20న ఉదయం కల్పవృక్ష వాహనంపై ఊరేగిస్తారు. రాత్రి సర్వభూపాల వాహనం సేవ నిర్వహిస్తారు. 21న ఉదయం పల్లకీ ఉత్సవం (మోహినీ అవతారం)లో స్వామి దర్శనమివ్వనున్నారు. రాత్రి గరుడ వాహనం (రాత్రి 7 గంటల నుంచి 9గంటల వరకు)పై భక్తులకు అనుగ్రహించనున్నారు. 22న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం సేవలు జరుగుతాయి. 23న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తారు. 24 ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం సేవలు జరుగుతాయి. 25న ఉదయం చక్రస్నానం (ఉదయం 8 నుంచి 10గంటల వరకు) నిర్వహిస్తారు. రాత్రి ధ్వజావరోహణం (సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు) నిర్వహిస్తారు. 26న మధ్యాహ్నం 3 గంటలకు పుష్పయాగం నిర్వహిస్తారు.